ఐటీ రంగానికి వలసల దెబ్బ, ఆ ఉద్యోగులకు యమ డిమాండ్
ఐటీ రంగానికి వలసలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ మొదలు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా ఇలా అన్ని ఐటీ దిగ్గజాలను వలసలు లేదా ఆట్రిషన్ రేటు ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి మారడం సహజమే. కరోనా అనంతరం డిజిటల్ నిపుణులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఉద్యోగుల వలసలు భారీగా పెరిగాయి. ఉద్యోగుల వలసలను తగ్గించేందుకు అన్ని కంపెనీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఆట్రిషన్ రేటు పెరిగింది
ఇతర సంస్థల నుండి మంచి ఆఫర్లు వస్తుండటంతో ఉద్యోగులు వెళ్లిపోతున్నారు. దీంతో కంపెనీలకు వేతనాలు భారంగా మారాయి. అదే సమయంలోఖాళీలను అవసరమై నిపుణులతో భర్తీ చేయడం సమస్యగా మారింది. ఐటీ పరిశ్రమ గతంలో ఎన్నడూ చూడనంత గరిష్టస్థాయికి ఆట్రిషన్ రేటు పెరిగింది. ఐటీ పరిశ్రమలో గతంలో వలసల రేటు 16 శాతంగా ఉంటే ఇప్పుడు 20 శాతం నుండి 25 శాతానికి పెరిగింది. ఈ సమస్య మరింతకాలం పరిశ్రమను ఇబ్బంది పెట్టే అవకాసాలు కనిపిస్తున్నాయి.

టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా
ఆట్రిషన్ రేటు లేదా వలసల సమస్య అగ్రశ్రేణి ఐటీ కంపెనీల నుండి అన్నీ ఎదుర్కొంటున్నాయి. ఐటీ దిగ్గజం టీసీఎస్ ఆట్రిషన్ రేటు 17.4 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. త్వరలో ఇది 20 శాతానికి పెరిగినా ఆశ్చర్యం లేదు. మరో రెండు త్రైమాసికాల పాటు ఈ సమస్య ఉంటుందని భావిస్తున్నారు. మరో అగ్రశ్రేణి ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ పరిస్థితి కూడా ఇంతే.
ఇన్ఫోసిస్‌లో 3.14 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. గత ఏడాది ఇదే కాలంలో ఉద్యోగుల సంఖ్య 2.59 లక్షలు మాత్రమే. ఏడాది వ్యవధిలో దాదాపు 55,000 మంది ఉద్యోగులు అదనంగా జత కలిశారు. అదే సమయంలో ఆట్రిషన్ రేటు 27.7 శాతానికి పెరిగింది. 2021 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇది 25.5 శాతంగా ఉంది. గత ఏడాది జనవరి - మార్చి త్రైమాసికంలో వలసల రేటు 10.9 శాతంగా ఉంది.

అందుకే ఆట్రిషన్ రేటు
ఆట్రిషన్ రేటు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం డిజిటల్ టెక్నాలజీ ప్రాజెక్టులు అధికంగా రావడమే. కరోనా సమయంలో వివిధ రంగాల సంస్థలు డిజిటల్ టెక్నాలజీని ఎక్కువగా అమలు చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీస్‌కు డిమాండ్ పెరిగింది. అమెరికా, ఐరోపా దేశాల సంస్థలు పెద్ద ఎత్తున డిజిటల్ ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి. దీనికి బడ్జెట్ కేటాయింపు కూడా గతంలో పోల్చితే ఎన్నో రెట్లు పెరిగింది.