ఆర్బీఐ కమిటీ 'కార్పోరేట్ ఓన్ బ్యాంకు'పై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు
ఇండస్ట్రియల్ హౌసెస్కు సొంత బ్యాంకింగ్ లైసెన్స్ ప్రతిపాదనలను ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, మాజీ డిప్యూటీ వైరల్ ఆచార్య వ్యతిరేకించారు. ఈ చర్య వినాశకరమైనదని అభిప్రాయపడ్డారు. పెద్ద వ్యాపార సంస్థలకు బ్యాంకులు రన్ చేసేందుకు అనుమతించాలని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేసిన కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను రాజన్, ఆచార్య ప్రశ్నించారు. ఇది ఒక బాంబు షెల్ అని అభిప్రాయపడ్డారు.
ప్రయివేటు బ్యాంకుల యాజమాన్యం, కార్పోరేట్ స్ట్రక్చర్ పైన భారతీయ రిజర్వ్ బ్యాంకు(RBI) ప్యానెల్ ఓ నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రయివేటు రంగ బ్యాంకుల్లో పదిహేనేళ్ల తర్వాత ప్రమోటర్ల చెల్లింపు ఈక్విటీ వాటా పరిమితిని 26 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ప్రయివేటురంగ బ్యాంకుల్లో ప్రమోటర్లు తమ యాజమాన్య వాటాను మూడేళ్లలో 40 శాతం, పదిహేనేళ్లలో 15 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంది.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణలు చేశాక భారీ కార్పోరేట్, పారిశ్రామిక సంస్థలకు బ్యాంకింగ్ లైసెన్స్లు ఇవ్వాలని కమిటీ సూచించింది. పర్యావరణ యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాలని పేర్కొంది. భారతీయ ప్రయివేటు బ్యాంకుల్లో యాజమాన్యం కార్పోరేట్ స్ట్రక్చర్ మార్గదర్శకాల్ని సమీక్షించేందుకు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీకే మహంతీ నేతృత్వంలో జూన్లో కమిటీ వేశారు.