'మా' అరెస్ట్ వార్త, జాక్మా అలీబాబా సంపద రూ.1.97 లక్షల కోట్లు ఆవిరి!
పేరు చివరలో 'మా' కలిగిన వ్యక్తి అరెస్టయ్యారనే వార్తలు చైనా ఇన్వెస్టర్లలో జాక్ మా గురించి కలకలం రేపాయి. దీంతో అలీబాబా సంపద భారీగా కరిగిపోయింది. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. దీంతో అలీబాబా షేర్ ధర కోలుకున్నది. 'మా' అరెస్ట్ అయ్యారని వార్తలు రావడంతో జాక్ మా అని భావించారు ఇన్వెస్టర్లు. దీంతో అలీబాబా స్టాక్స్ కుప్పకూలాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నిమిషాల్లో 27 బిలియన్ డాలర్లు లేదా రూ.1.97 లక్షల కోట్లు కోల్పోయింది.
గత రెండు మూడేళ్లుగా చైనా ప్రభుత్వం... జాక్ మా పైన ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో ఆయన బయటకు రావడం తగ్గింది. ఇటీవల చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ 'మా' అనే పేరు కలిగిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపింది. జాతీయ భద్రతకు సంబంధించిన ఉల్లంఘనలకు పాల్పడ్డారని, దీంతో హాంగ్యు నగరానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. ఇదే ప్రాంతంలో జాక్ మాకు చెందిన ఈ కామర్స్ వ్యాపారం ఉంటుంది. ఆయన పుట్టింది కూడా ఇక్కడే. దీంతో 'మా' అరెస్ట్ జాక్ మా అరెస్టుగా భావించారు. అందుకే అలీబాబా స్టాక్స్ 9.4 శాతం కుప్పకూలాయి.

2019 చైనా మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ రిపోర్ట్ ప్రకారం చైనాలో 'మా' అనేది 13వ కామన్ సర్నేమ్. హాంగ్యు నగరంలో 12 మిలియన్ల ప్రజలు ఉండగా, ఇందులో 1,00,000 మంది పేరు చివరన 'మా' సర్ నేమ్ ఉంటుంది. అయితే ఇప్పుడు అరెస్టైన 'మా' 1985లో జన్మించాడు. జాక్ మా కంటే ఇరవై ఏళ్లు చిన్న.