జియోకు ఎయిర్టెల్ ఝలక్, వొడాఫోన్ ఐడియాకు కస్టమర్లు షాక్
వైర్లెస్ కస్టమర్లను జత చేసుకోవడంలో భారతీ ఎయిర్టెల్ వరుసగా రెండో నెల ముందు నిలిచింది. తక్కువ ధరకు డేటా, కాల్ టారిఫ్‌తో నాలుగేళ్లుగా దూసుకెళ్తున్న రిలయన్స్ జియోకు ఎయిర్టెల్ షాకిచ్చింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) ప్రకారం సెప్టెంబర్ నెలలో జియో కంటే ఎయిర్టెల్ 23 లక్షల మందిని ఎక్కువగా జత చేసుకుంది.
ఎయిర్టెల్ 37.7 లక్షల సబ్స్క్రైబర్లను జత చేసుకోగా, జియో 14.6 లక్షల మందిని జత చేసుకుంది. జియోతో పోలిస్తే ఎయిర్ టెల్ రెండింతల కంటే ఎక్కువగా కస్టమర్లను ఆకర్షించింది. ఇటీవల కస్టమర్లను కోల్పోతున్న వొడాఫోన్ ఐడియా ఈసారి కూడా చేజార్చుకుంది. సెప్టెంబర్ చివరి నాటికి జియో టెలికం వాటా 35.19 శాతం కాగా, ఎయిర్టెల్ 28.44 శాతంతో రెండో స్థానంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో మరో 3 పట్టణాల్లో జియో ఫైబర్ సేవలు: జియో ఫైబర్ 4 ప్లాన్లు ఇవే..

వరుసగా రెండో నెల.. ఎయిర్టెల్ రికార్డ్
ఎయిర్టెల్ చందాదారులు ఆగస్ట్ నెలలో 32.28 కోట్లుగా ఉండగా, సెప్టెంబర్ నాటికి 32.66 కోట్లకు పెరిగింది. ఇది 1.17 శాతం వృద్ధి. ఒక నెల రోజుల్లో 37.7 లక్షల మంది చందాదారులు జత కావడం రికార్డ్. ఏ టెల్కోకు ఒక నెలలో ఇంతమంది మెంబర్స్ జతకాలేదు.
జియో యూజర్లు ఆగస్ట్‌లో 40.26 కోట్లు కాగా, సెప్టెంబర్ ముగిసే నాటికి 40.41 కోట్లకు పెరిగారు. ఆగస్ట్ నెలలోను జియో కంటే 10 లక్షలమంది మెంబర్లు ఎయిర్‌టెల్‌కు ఎక్కువగా జత కలిశారు. అంటే వరుసగా రెండో నెల ఎయిర్టెల్... జియోను దాటేసింది.

వొడాఫోన్ ఐడియా కస్టమర్లు డౌన్
ప్రభుత్వరంగ టెల్కో బీఎస్ఎన్ఎల్కు సెప్టెంబర్‌లో కొత్తగా చందాదారులు 78,454 మంది జత కలిశారు. ఆగస్ట్ నెలలో జత కలిసిన సబ్స్క్రైబర్ల కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. అప్పుడు 2 లక్షల మందికి పైగా కొత్తగా చేరారు. సెప్టెంబర్ నాటికి బీఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటా 10.36 శాతంగా ఉంది.
ఇక, వొడాఫోన్ ఐడియా 25.73 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. అయితే ఈ టెల్కో ఒక్కటే కస్టమర్లను భారీగా కోల్పోయింది. గత కొద్ది నెలలుగా వొడాఫోన్ ఐడియా కస్టమర్లు తగ్గిపోతున్నారు. సెప్టెంబర్ నెలలో వొడాఫోన్ ఐడియా కస్టమర్లు 46 లక్షల మందికి పైగా కస్టమర్లను కోల్పోయింది.

కస్టమర్లు ఎంత శాతం పెరిగారంటే
నెల ప్రాతిపదికన వొడాఫోన్ ఐడియా కస్టమర్లు సెప్టెంబర్ నెలలో 1.55 శాతం తగ్గింది. ఎయిర్ టెల్ కస్టమర్లు 1.17 శాతం పెరిగారు. రిలయన్స్ జియో కస్టమర్లు 0.03 శాతం, బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు 0.07 శాతం పెరిగారు. మొత్తం వైర్లెస్ కస్టమర్లు ఆగస్ట్ చివరి నాటికి 1,147.92 మిలియన్లు పెరగగా, సెప్టెంబర్ చివరి నాటికి 1,148.58 మిలియన్లకు పెరిగారు.