వేతనాల కోత, అత్యవసర సమావేశం కోసం ఎయిరిండియా పైలట్ల డిమాండ్
ఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా ఏవియేషన్, ఆతిథ్య రంగాలపై అన్నింటి కంటే ఎక్కువగా పడింది. ఏవియేషన్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో అన్ని సంస్థలు ఉద్యోగుల కోత, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాయి. ఇప్పుడు కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వేతనాల కోతపై చర్చలకు రావాలని ఎయిరిండియా పైలట్లు.. కేంద్ర ఆర్థికమంత్రి హర్దీప్ సింగ్ పూరీని డిమాండ్ చేశారు. ఈ మేరకు లేఖ రాశారు.

విమాన రంగంపై కరోనా ప్రభావం
లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి చివరి వారం నుండి విమాన కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. మే నెలలో క్రమంగా విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ అన్ని మార్గాల్లో నడవలేదు. ఎయిర్ బబుల్స్ ద్వారా ప్రభుత్వం కార్యకలాపాలు పునఃప్రారంభింప చేసింది. అయితే ప్రయాణీకుల సామర్థ్యం, విమానాల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్, ఇండియన్ పైలట్స్ గిల్డ్ కేంద్రమంత్రికి లేఖ రాసింది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్, అలయెన్స్ ఎయిర్ పైలట్లు దాదాపు 70 శాతం వరకు వేతన కోత ఎదుర్కొంటున్నారు.

65 శాతం కార్యకలాపాలు
ఇదిలా ఉండగా, విమాన కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటున్నాయని పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ తెలిపారు. కరోనాకు ముందున్న పరిస్థితులతో పోల్చితే దాదాపు 65 శాతం సాధారణస్థితి నెలకొందన్నారు. విమానయానం, పర్యాటకం-ముందున్నవి మంచి రోజులే అనే అంశంపై ఇటీవల భారతీయ పర్యాటక, హోటళ్ల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. విమానయానం కోలుకుంటున్నందున పర్యాటక పరిశ్రమ కూడా తిరిగి పుంజుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పర్యాటకరంగానికీ ఊతం..
కరోనా మహమ్మారికి ముందు ప్రతి రోజు 3.70-3.75 లక్షలమంది విమానాల్లో ప్రయాణించేవారని, ఆ తర్వాత 79వేలకు పడిపోయిందన్నారు. ఇప్పుడు 2.50 లక్షలకు పెరిగిందని తెలిపారు. త్వరలో కరోనా ముందునాటి పరిస్థితికి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. విమానయాన రంగం సాధారణ స్థితికి వస్తే పర్యాటక రంగం కూడా ఊపందుకుంటుందని చెబుతున్నారు. కాబట్టి దేశీయ విమానయాన సంస్థలకు ఊతమిచ్చేలా పర్యాటకరంగ సంస్థలు నిర్ణయాలు తీసుకోవాలన్నారు.