అంచనాలను అందుకోలేని అదాని: మిగిలింది ఒక్కరోజే
ముంబై: గుజరాత్‌కు చెందిన దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానికి చెందిన తాజా పబ్లిక్ ఇష్యూ.. అంచనాలను అందుకోలేకపోతోంది. టాప్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లల్లో ఒకటైనప్పటికీ.. ఆ స్థాయిలో సబ్స్క్రిప్షన్లను సాధించలేకపోతోంది. ఇప్పటికే రెండు రోజులు ముగిసిపోయాయి. ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలివుంది. సోమవారం ఈ పబ్లిక్ ఇష్యూ దరఖాస్తు గడువు ముగియనుంది. ఈలోగా తన సబ్స్క్రిప్షన్ల సంఖ్య, గ్రే మార్కెట్ ప్రీమియం మొత్తాన్నీ పెంచుకోగలుగుతుందనే అభిప్రాయాలు మార్కెట్లో నెలకొని ఉన్నాయి.

జాయింట్ వెంచర్..
అదే- అదాని విల్మార్ ఐపీఓ. భారీ అంచనాలతో ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఐపీఓను జారీ చేసింది. 3,600 కోట్ల రూపాయల మేర పెట్టుబడులను ప్రజల నుంచి సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అదానీ గ్రూప్, సింగపూర్‌కు చెందిన విల్మార్ గ్రూప్ జాయింట్ వెంచర్‌గా ఏర్పడిన కంపెనీ ఇది. ఈ రెండింటికీ 50 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. 3,600 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేసింది.

తొలి రోజు 56 శాతం మాత్రమే..
అదాని విల్మార్ ఐపీఓ ఈ నెల 27వ తేదీన ఓపెన్ అయింది. 31వ తేదీన ముగుస్తుంది. తొలి రోజు ఆశించిన స్థాయిలో సబ్‌స్క్రిప్షన్‌ను సాధించలేకపోయింది. 56 శాతం మాత్రమే సబ్స్క్రిప్షన్ నమోదైంది. ఇది మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) సెగ్మెంట్‌కు సంబంధించినదే అయినప్పటికీ, బహిరంగ మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా సబ్‌స్క్రిప్షన్‌ను సాధించలేకపోవడం చర్చనీయాంశమైంది.

జీఎంపీ తగ్గింపు..
అదాని విల్మార్ పబ్లిక్ ఇష్యూ జారీ కావడానికి ముందు గ్రే మార్కెట్లో దీని విలువ 130 రూపాయల వరకు పలికింది. ఐపీఓ జారీ అయిన తరువాత అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి రోజు ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం విలువ 44 రూపాయలకు పడిపోయిందంటే ఈ ఐపీఓకు ఉన్న డిమాండ్, క్రేజ్ ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో నెలకొన్న పతనమే దీనికి కారణమని తేల్చారు విశ్లేషకులు.

రెండో రోజు కొంత బెటర్..
రెండో రోజు మాత్రం కొంత ఫర్వాలేదనిపించుకుంది. తన సబ్స్క్రిప్షన్, జీఎంపీని పెంచుకోగలిగింది. రెండో గడువు ముగిసే సమయానికి 1.13 సార్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందగలిగింది. రెండో రోజు 12,25,46,150 షేర్లకు 13,85,77,270 బిడ్స్ దాఖలయ్యాయి. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్ల శాతమే అధికం. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 88 శాతం, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 39 శాతం మేర బిడ్స్ దాఖలు చేశారు. జీఎంపీ వాల్యూ కూడా 44 నుంచి 50 రూపాయలకు పెరిగింది.

ఎల్లుండి ముగింపు..
సోమవారం ఈ పబ్లిక్ ఇష్యూ క్లోజ్ అవుతుంది. చివరి రోజు కావడంతో సబ్స్క్రిప్షన్ల సంఖ్య భారీగా పెరుగుతుందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. అదాని విల్మార్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 218 నుంచి 230 రూపాయలు. లాట్ సైజు 65. కనీసం 65 షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే 14,950 రూపాయలను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో బిడ్డర్ ఒకేసారి గరిష్ఠంగా 13 లాట్స్ వరకు అప్లికేషన్‌ను దాఖలు చేయవచ్చు.

8న లిస్టింగ్..
ఫిబ్రవరి 3వ తేదీన షేర్ల అలాట్మెంట్ ఉంటుంది. అలాట్మెంట్ దక్కని వారికి ఆ మరుసటి రోజు నుంచి బిడ్డింగ్ మొత్తాన్ని రీఫండ్ చేస్తుందీ కంపెనీ. అదే నెల 8వ తేదీన బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లల్లో ఈ ఐపీఓ లిస్టింగ్ అవుతుంది. లిస్టింగ్ రోజు అప్పర్ సర్క్యుట్లోనే ట్రేడింగ్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.