931 స్టాక్స్ లోయర్ సర్క్యూట్ టచ్, ఒక్కరోజే రూ.10 లక్షల కోట్లు పోయాయి
స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజైన సోమవారం భారీగా నష్టపోయాయి. టెక్నాలజీ స్టాక్స్ వరుసగా ఆరో రోజు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ నేడు 3 శాతం చొప్పున నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.9.15 లక్షల కోట్లు క్షీణించింది. చివరి ఐదు సెషన్లలో సెన్సెక్స్ భారీగా నష్టపోవడంతో ఈ కాలంలో దాదాపు రూ.20 లక్షల కోట్ల మేర క్షీణించింది. బీఎస్ఈ 30 స్టాక్స్‌లో పద్దెనిమిది రెండు శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. బజాజ్ ఫైనాన్స్ 6.24 శాతం, టాటా స్టీల్ 5.91 శాతం క్షీణించాయి. ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. టెక్ మహీంద్రా 5.35 శాతం, విప్రో 5.44 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 3.87 శాకం, ఇన్ఫోసిస్ 2.87 శాతం క్షీణించాయి. హెవీ వెయిట్ రిలయన్స్ 4 శాతం కంటే ఎక్కువగా నష్టపోయింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 4 శాతం చొప్పున పడిపోయాయి.

చిన్న కంపెనీలే అధికం
బీఎస్ఈలో ట్రేడ్ అవుతున్న 3700కు పైగా కంపెనీ షేర్లలో 931 లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. మొత్తం షేర్లలో ఇది దాదాపు 25 శాతానికి సమానం. ఈ షేర్ల కొనుగోలుకు బయ్యర్స్ లేని పరిస్థితి. చిన్న కంపెనీల షేర్ల వ్యాల్యూ ఈ విక్రయాల దెబ్బకు పతనమైంది. లోయర్ సర్క్యూట్‌ను తాకిన 875 స్టాక్స్‌లో 694 చిన్న కంపెనీలు. అంటే వీటి వాటా 79 శాతం, BSE XT నుండి 333, BSE X నుండి 166, BSE T నుండి 141, BSE Z నుండి 54 ఉన్నాయి.

రూ.20 లక్షల కోట్లు ఆవిరి
సెన్సెక్స్ వరుసగా ఐదో రోజు పతనమైంది. జనవరి 17వ తేదీ నుండి సెన్సెక్స్ దాదాపు 4000 పాయింట్ల వరకు నష్టపోయింది. నిఫ్టీ 1200 పాయింట్లు క్షీణించింది. దీంతో అప్పటి నుండి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపద నేడు ఒక్కరోజే దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆవిరైంది. నేడు ఐటీ, మెటల్, రియాల్టీ స్టాక్స్ భారీగా పడిపోయాయి.

స్టాక్స్ నష్టం
నేడు 518 స్టాక్స్ లాభాల్లో, 3068 స్టాక్స్ నష్టాల్లో ముగియగా, 120 స్టాక్స్‌లో ఎలాంటి మార్పులేదు. నేడు 252 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి. అదే సమయంలో 68 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. అప్పర్ సర్క్యూట్‌ను తాకిన స్టాక్స్ 262 కాగా, లోయర్ సర్క్యూట్‌ను తాకిన స్టాక్స్ 931 ఉన్నాయి.