శరవేగంగా జియో 5జీ: ఒప్పోతో ఒప్పందం
ముంబై: దేశంలో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ కంపెనీగా గుర్తింపు పొందిన రిలయన్స్ జియో.. ఈ సెగ్మెంట్‌పై తన పట్టును మరింత పెంచుకుంటోంది. ఇతర సర్వీస్ ప్రొవైడర్ల కంటే ముందంజలో ఉంటోంది. 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏకంగా వెయ్యి నగరాలను ఈ నెట్వర్క్ పరిధిలోకి తీసుకుని రానుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నట్లు ప్రకటించింది.
దీనికి అవసరమైన ఫైబర్ కెపాసిటీని పెంచుకోవడంపై ప్రస్తుతం దృష్టి సారించామని, ఎంపిక చేసిన ఈ వెయ్యి నగరాల్లో దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 5జీ నెట్‌వర్క్‌లో విస్తరింపజేయడానికి ప్రత్యేకంగా డెడికేటెడ్ సొల్యూషన్ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 1000 నగరాల్లో 5జీ నెట్వర్క్ కవరేజ్ పూర్తయింది. ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ ట్రయల్స్ దాదాపుగా చివరిదశకు వచ్చేశాయి.

ఈ పరిణామాల మధ్య రిలయన్స్ జియో కొత్తగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పోతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్మార్ట్‌ఫోన్లల్లో 5జీ స్లాండ్ అలోన్, నాన్ స్టాండ్ అలోన్ నెట్వర్క్ ట్రయల్స్‌ను నిర్వహించడానికి కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఇది. ఒప్పో తయారు చేసిన రెనో 7 సిరీస్‌లో 5జీ నెట్వర్క్ వినియోగానికి సంబంధించిన ట్రయల్స్‌ను నిర్వహిస్తుంది రిలయన్స్ జియో. 3.3-3.6 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ రేంజ్‌తో 5జీ నెట్వర్క్.. స్మార్ట్‌ఫోన్లల్లో బఫర్ లేకుండా ఎలా పని చేస్తుందనేది రెనో 7 సిరీస్ మోడల్స్‌లో టెస్ట్ చేస్తారు.
ముంబైలో ఒలింపిక్ సెషన్స్: నీతా అంబానీ కీలక వ్యాఖ్యలు
హెల్త్‌కేర్, ఇండస్ట్రీయల్ ఆటొమేషన్ టెక్నాలజీతో రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 1000 నగరాల్లో 5జీ నెట్వర్క్ సేవలను అందించడానికి కసరత్తు చేస్తోంది. నెట్వర్క్ ప్లానింగ్‌లో 3డీ మ్యాప్స్, రే ట్రేసింగ్ టెక్నాలజీ వంటి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందా సంస్థ. కేంద్రం నుంచి అనుమతులు రాగానే.. దీన్ని ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకుంటోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 5జీ స్పెక్ట్రమ్‌ను కేంద్ర ప్రభుత్వం వేలం వేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో- తన నెట్వర్క్ ట్రయల్స్‌ను శరవేగంగా పూర్తి చేస్తోంది.