వారికి రూ.4,000 ఇచ్చి, మాకు రూ.400 ఇస్తున్నారు: అమిత్ షాతో జగన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు ముప్పావు గంట పాటు వారిద్దరు చర్చించారు. వివిధ అంశాలతో పాటు ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు గురించి కూడా మాట్లాడుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలో హామీలు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి వరద జలాల తరలింపు తదితర అంశాలపై అమిత్ షాతో మాట్లాడారు.
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం, గడువు, ఫీజు, ఏ ప్రాంతాల్లో...

ఈ నిధులు ఇవ్వండి...
రాష్ట్ర విభజన పరిశ్రమలు, సేవా రంగాలపై ప్రభావం చూపిందని వైయస్ జగన్ ఈ సందర్భంగా అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. విభజన సమయంలో రెవెన్యూ లోటు రూ.22,948 కోట్లకు పైగా ప్రకటించినప్పటికీ కేంద్రం నుంచి రూ.18,969 కోట్లకు పైగా రావాలి చెప్పారు. కడపలో స్టీల్ ప్లాంట్, రామాయపట్నంలో పోర్టు నిర్మాణాల అంశాలు కూడా ప్రస్తావించారు. విశాఖపట్నం - చెన్నై కారిడార్, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన నిధులు సమకూర్చాలని కోరారు.

సగమే ఇచ్చారు..
ఏపీలో వెనుకబడిన జిల్లాల కింద రూ.2,100 కోట్ల నిధులు కేటాయించగా కేవలం రూ.1,050 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని జగన్ గుర్తు చేశారు. ఏపీలో వెనుకబడిన జిల్లాల్లో ఒక్కొక్కరికి రూ.400 చొప్పున ఇస్తే, బుందేల్ ఖండ్, కలహండి ప్రాంతాలకు రూ.4000 ఇస్తున్నారని గుర్తు చేశారు.

రూ.838 కోట్లు ఆదా చేశాం..
పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548 కోట్లకు ఆమోదించాలని కోరారు. ఇందులో రూ.33వేల కోట్లు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్కే ఖర్చు అవుతోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా రూ.838 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామన్నారు.

ప్రత్యేక హోదాపై విజ్ఞప్తి
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరుతో పాటు పరిశ్రమలు ఏపీవైపు చూడాలంటే ప్రత్యేక హోదా అవసరం అన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలంకు గోదావరి వరద జలాల తరలింపుపై అమిత్ షాతో జగన్ చర్చించారు.