అరబిందో ఫార్మాకు హైదరాబాద్ యూనిట్ తలనొప్పి, అమెరికా FDA భారీ షాక్
ప్రముఖ ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మాకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) భారీ షాకిచ్చింది. హైదబాద్ శివారులోనీ ఈ సంస్థ యూనిట్ 7లో తనిఖీలు నిర్వహించి 7 లోపాలను గుర్తించింది. అరబిందో ఫార్మాతో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని మరో ఫార్మా సంస్థ గ్లెన్‌మార్క్‌కు కూడా వార్నింగ్ లేఖ ఇచ్చింది. వార్నింగ్ లేఖ ఇచ్చినప్పటికీ, ఈ కంపెనీలు అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవచ్చు. ఇది వార్నింగ్ మాత్రమే.

అమెరికా నుంచి అరబిందోకు భారీ రెవెన్యూ
అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తుల ద్వారా అరబిందో ఫార్మాకు 25 నుంచి 30 శాతం ఆదాయం, గ్లెన్‌మార్క్‌కు 7 శాతం ఆదాయం వస్తోంది. అరబిందో ఫార్మా హెడ్ క్వార్టర్ హైదరాబాదులో ఉంది. అమెరికాకు ఎగుమతి చేసే జనరిక్ కంపెనీల్లో అయిదో పెద్ద కంపెనీ. అమెరికా నుంచి దాదాపు రూ.9,030 కోట్ల రెవెన్యూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికా మార్కెట్ రెవెన్యూ 50 శాతం వరకు ఉంటుందని భావిస్తున్నారు.

ఐదేళ్ల కనిష్టానికి అరబిందో షేర్లు
USFDA షాక్ నేపథ్యంలో ఈ కంపెనీల షేర్లు సోమవారం భారీగా నష్టపోయాయి. అరబిందో ఫార్మా షేర్లు 20 శాతం నష్టపోయి అయిదేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. చివరకు రూ.458.50 వద్ద క్లోజ్ అయింది. గ్లెన్‌మార్క్ స్టాక్స్ 52 వారాల కనిష్టానికి చేరుకొని రూ.286.3 వద్ద ముగిశాయి. కాగా, ఈ యూనిట్‌ను గత నెలలో USFDA తనిఖీ చేసి ఏడు అభ్యంతరాలు తెలిపినట్లు అరబిందో ఫార్మా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు సోమవారం వెల్లడించింది. దీంతో షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

అభ్యంతరాలు..
USFDA ప్రతినిధులు గత నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య అరబిందో ఫార్మా ఔషధ యూనిట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ ప్లాంటుపై ఇప్పటికే పలు అభ్యంతరాలు ఉండగా అవి ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ లోపు మళ్లీ కొన్ని అభ్యంతరాలు రావడం గమనార్హం. తాజాగా లేవనెత్తిన అంశాల్లో ప్రధానంగా ఔషధాల తయారీకి సంబంధించినవే ఉన్నాయి.

అభ్యంతరాలు సరిదిద్దుతాం
ఇదిలా ఉండగా, హైదరాబాదులోని తమ ప్లాంట్ యూనిట్లో USFDA లేవనెత్తిన అభ్యంతరాలను గడువులోగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తామని అరబిందో ఫార్మా తెలిపింది. డేటా ఇంటిగ్రిటీకి సంబంధించిన అభ్యంతరాలు లేవని తాము భావిస్తున్నామని, అయినప్పటికీ అభ్యంతరాలను సాధ్యమైనంత త్వరగా సరిదిద్దుకుంటామని పేర్కొంది. అభ్యంతరాలు సరిదిద్ది USFDAకు రిపోర్ట్ ఇస్తామని తెలిపింది.