ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ ముందు పలు సవాళ్లు
న్యూఢిల్లీ: నిర్మలా సీతారామన్.. డిఫెన్స్ మినిస్టర్‌గా సత్తాచాటిన ఈ తెలుగింటి కోడలు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి. ఇందిరాగాంధీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళగా రికార్డ్ సృష్టించారు. 1970 నుంచి 1971 మధ్య నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆర్థిక శాఖను అట్టిపెట్టుకున్నారు. 2006లో బీజేపీలో చేరిన నిర్మల... 2010 నుంచి 2014 వరకు బీజేపీ జాతీయ ప్రతినిధిగా పని చేశారు.
2014లో మోడీ ప్రధాని అయ్యాక కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు. ఆమె ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2017లో ఆమె రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టారు. 2003 నుంచి 2005 మధ్య జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఆమె ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి.
ఎవరూ ఊహించని మోడీ నిర్ణయం: నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖ

బీజేపీ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించారని, కానీ ఊహించినంతగా లేవనే విమర్శలు ఉన్నాయి. దీనిని అధిగమించాల్సి ఉంది. నిరుద్యోగత తగ్గాలంటే ప్రతి ఏడాది 1 మిలియన్ కొత్త ఉద్యోగాల సృష్టి జరగాలి. ఇది ప్రపంచ బ్యాంక్ లెక్క. ఈ దిశగా నిర్మలా సీతారామన్ ఏం చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరం. అలాగే, ఆర్థిక రంగాన్ని మరింత పట్టాలెక్కించడం ఆమె ముందు ఉన్న సవాల్.
NBFCలపై దృష్టి పెట్టాలని ఇప్పటికే అనిల్ అంబానీ వంటి వారు విజ్ఞప్తి చేశారు. గ్రాస్ ఫిక్స్డ్ కాపిటల్ ఫార్మేషన్‌పై దృష్టి సారించాలి. భారత్ ఎగుమతుల శాతం పెంచవలసి ఉంది. 2014తో (25.4 శాతం) పోలిస్తే 2019 (19.7 శాతం) నాటికి ఎక్స్పోర్ట్ తగ్గింది. ద్రవ్యలోటు కూడా ఆమె ముందు ఉన్న మరో సవాల్.