ఎవరూ ఊహించని మోడీ నిర్ణయం: తెలుగింటి కోడలు నిర్మలకు కీలక ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ కేబినెట్లో ఆర్థిక శాఖ ఎవరికి దక్కుతుందనే అంశం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు, అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితుల కారణంగా గైర్హాజరైనప్పుడు పీయూష్ గోయల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో ఆయనకే దక్కుతుందని తొలుత భావించారు. గత రెండు రోజులుగా అమిత్ షాకు ఆర్థిక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగింది. అయితే అమిత్ షా లేదంటే గోయల్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తారని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా నిర్మలా సీతారామన్‌కు ఫైనాన్స్ శాఖ అప్పగించి మోడీ అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఆ అప్పులు ఈ లోపే చెల్లించాలి: జగన్ ముందు కఠిన ఆర్థిక సవాళ్లు... ఇవే!

నిర్మలా సీతారామన్
నిర్మలా సీతారామన్‌కు ఫైనాన్స్, కార్పోరేట్ అఫైర్స్ అప్పగించారు. మోడీ కేబినెట్లో అన్ని వర్గాలకు, మహిళలకు సమప్రాధాన్యత ఇస్తున్నారు. మోడీ మొదటి టర్మ్‌లో సీతారామన్ డిఫెన్స్ మినిస్టర్‌గా పని చేశారు. భారత తొలి డిఫెన్స్ మినిస్టర్ ఈమెనే కావడం గమనార్హం. అలాగే, ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఆర్థిక శాఖ చేపట్టిన రెండో మహిళ నిర్మలా సీతారామన్. అంతకుముందు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉంటూ ఆర్థిక శాఖ అట్టి పెట్టుకున్నారు. కీలకమైన హోంశాఖ అమిత్ షాకు, రక్షణ శాఖను రాజ్‌నాథ్ సింగ్‌లకు ఇచ్చారు. గతంలో విదేశాంగ శాఖ కార్యదర్శిగా పని చేసిన జైశంకర్‌కు విదేశాంగ శాఖ మంత్రి బాధ్యతలు ఇచ్చారు.

ఎవరీ నిర్మలా సీతారామన్?
తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ఎన్డీయే ప్రభుత్వంలో కీలక శాఖలు చేపడుతున్నారు. డిఫెన్స్ మినిస్టర్‌గా ఆమె తన సత్తా నిరూపించారు. ఇప్పుడు ఆర్థిక శాఖ చేపట్టారు. తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్. ఆయన గత చంద్రబాబు ప్రభుత్వంలో సలహాదారుగా పని చేశారు. అయితే బీజేపీ - టీడీపీ మధ్య విభేదాల నేపథ్యంలో నిర్మలకు కేంద్రంలో కీలక పదవులు లభించడంతో పరకాల ఏపీలో తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నిర్మలా సీతారామన్ 1959 ఆగస్ట్ 18న తిరుచిరాపల్లిలో జన్మించారు. 1980లో సీతారామలక్ష్మి రామస్వామి కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఢిల్లీలోని జెఎన్యూలో ఎంఫిల్ పట్టా తీసుకున్నారు. ఆమె ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పని చేశారు. బీబీసీలోను పని చేశారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పని చేశారు. 2010లో బీజేపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. నిర్మల సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి నిన్న డిఫెన్స్, ఇప్పుడు ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టారు.

కేంద్రమంత్రులకు శాఖలు
- నరేంద్ర మోడీ (ప్రధానమంత్రి) - మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ తదితరాలను తన వద్ద అట్టిపెట్టుకున్నారు.
- అమిత్ షా - హోమ్ మంత్రి
- రాజ్‌నాథ్ సింగ్ -రక్షణ శాఖ
- నిర్మలా సీతారామన్ - ఆర్థికశాఖ, కార్పోరేట్ అఫైర్స్
- నితిన్ గడ్కరీ - రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమలు
- ఎస్ జయశంకర్ - విదేశాంగశాఖ
- స్మృతి ఇరానీ - మహిళా, శిశు సంక్షేమ శాఖ, జౌళీ శాఖ
- సదానందగౌడ: రసాయన, ఎరువుల శాఖ
- రవిశంకర ప్రసాద్ - న్యాయ, సమాచార, ఐటీ శాఖ
- హర్సిమ్రాత్ కౌర్ బాదల్ - ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ
- రామ్‌విలాస్ పాశ్వాన్ - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు
- మహేంద్ర నాథ్ పాండే - నైపుణ్యాభివృద్ధి శాఖ
- అరవింద్ గణపత్ సావంత్ - భారీ పరిశ్రమలు
- ప్రహ్లాద్ జోషీ - పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ
- పీయూష్ గోయల్ - రైల్వే శాఖ, పరిశ్రమల శాఖ
- ముక్తార్ అబ్బాస్ నక్వీ - మైనార్టీ అఫైర్స్
- నరేంద్రసింగ్ తోమర్ - వ్యవసాయం, రైతుల సంక్షేం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్
- థావర్ చంద్ గెహ్లాట్ - సామాజిక న్యాయం, సాధికారత
- గిరిరాజ్ సింగ్ - పాడి, పశుగణాభివృద్ధి, పిషరీస్
- అర్జున్ ముండా - గిరిజన సంక్షేమం
- హర్షవర్ధన్ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
- ధర్మేంద్ర ప్రదాన్ - పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ
- రమేష్ పొఖ్రియాల్ నిషంక్ - మానవ వనరుల అభివృద్ధి శాఖ