దిగొచ్చిన ద్రవ్యోల్బణం: ఆర్బిఐపై ఆశలు

ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ఈ నెలాఖరులో ప్రకటించనున్న ద్రవ్యపరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గడానికి అవకాశం ఉందన్న ఆశలు చిగురించాయి. మరోవైపు ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తున్న సంకేతాలు వెలువడినందువల్ల ఆర్బిఐ ఇప్పటికైనా ద్రవ్య విధానంలో పట్టువిడుపుల ధోరణి అనుసరించాలని పారిశ్రామిక, వాణిజ్య మండలులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. జనవరి 28న ఆర్బిఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష విడుదల చేయనున్న నేపథ్యంలో వారి అభిప్రాయానికి ప్రాధాన్యత ఏర్పడింది.
నవంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి ఆరు నెలల కనిష్ఠ స్థాయిలో 2.1 శాతానికి పడిపోయిన విషయం కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అటు వృద్ధిరేటు, ఇటు ద్రవ్యోల్బణం గణాంకాలు రెండింటినీ పరిగణలోకి తీసుకుంటే జనవరి 28న ప్రకటించనున్న విధాన సమీక్షలో ఆర్బిఐ వడ్డీరేట్లలో యథాతథ స్థితి కొనసాగించే అవకాశం ఉందని బార్క్లేస్ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం తగ్గుతుందని ప్రభుత్వం, ఆర్బిఐ అంచనా వేశాయని, ఈ నేపథ్యంలో వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారాం పేర్కొన్నారు.
పారిశ్రామికోత్పత్తి పతనమవుతున్న వేళ ద్రవ్యోల్బణం తగ్గింది కాబట్టి ఆర్బిఐ పారిశ్రామిక శ్రేయస్సు, వృద్ధిరేటు బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకుని వడ్డీరేట్లను తగ్గించాలని సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. టోకు ధరల సూచీలో నిలకడైన తగ్గుదల కనిపిస్తోందని, ఇది వడ్డీరేట్ల తగ్గుదలకున్న అవకాశాలను పెంచిందని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డిఎస్ రావత్ వెల్లడించారు. పారిశ్రామిక రంగానికి నూతనోత్తేజాన్ని అందించేందుకు వడ్డీరేట్లు తగ్గాల్సిన అవసరం ఉందని పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శరద్ జైపురియా పేర్కొన్నారు.