ప్రపంచ టాప్ 500లో రిలయన్స్, టీసీఎస్ సహా 11 కంపెనీలు: వీటి వ్యాల్యూ ఎంతంటే
హూరున్ గ్లోబల్ 500 కంపెనీల జాబితాలో భార్ నుండి 11 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్ 10వ స్థానంలో నిలిచింది. మన దేశానికి చెందిన ఈ పదకొండు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 805 బిలియన్ డాలర్లు లేదా రూ.60 లక్షల కోట్లు. ఈ నివేదిక ప్రకారం ఈ కంపెనీల వ్యాల్యూ 14 శాతం పెరిగింది. భారత జీడీపీలో ఇది మూడో వంతు. ఈ కంపెనీలన్నీ కూడా ప్రయివేటు రంగానివే. కరోనా సమయంలో ఈ సంస్థలు పతనమైనప్పటికీ, 2020 చివరి నాటికి భారీగా ఎగిశాయి.

6 దేశాల జీడీపీతో సమానం
మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 కంపెనీల మార్కెట్ వ్యాల్యూ 50 లక్షల కోట్ల డాలర్లు. ఇది ప్రపంచంలోని ఆరు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు.. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్, బ్రిటన్ దేశాల సంయుక్త జీడీపీకి సమానం. ఈ కంపెనీలు 4.3 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇది జర్మనీ జనాభాతో సమానం. ఈ కంపెనీల విక్రయాలు 18 లక్షల కోట్ల డాలర్లతో చైనా జీడీపీ కంటే ఎక్కువగా ఉంది.

రిలయన్స్ 54, టీసీఎస్ 73
మన దేశానికి చెందిన 11 కంపెనీల్లో అత్యధికంగా లాభపడిన వాటిలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఇది గత ఏడాది 20.5 శాతం ఎగిసి మార్కెట్ క్యాప్ 168.8 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచ కంపెనీల్లో 54వ స్థానంలో నిలిచింది. టాటా కన్సల్టెన్సీ (TCS) 30 శాతం లాభపడి కంపెనీ వ్యాల్యూ 139 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా73వ స్థానంలో నిలిచింది.

మార్కెట్ క్యాప్
HDFC బ్యాంకు 11.5 శాతం ఎగిసి వ్యాల్యూ 107.5 బిలియన్ డాలర్లు, హిందూస్తాన్ యూనీలీవర్ 3.3 శాతం లాభపడి 68.2 బిలియన్ డాలర్లు, ఇన్ఫోసిస్ వ్యాల్యూ 56.6 శాతం ఎగిసి 66 బిలియన్ డాలర్లు, HDFC లిమిటెడ్ 2.1 శాతం ఎగిసి 56.4 బిలియన్ డాలర్లు, కొటక్ మహీంద్రా బ్యాంకు 16.8 శాతం ఎగిసి 50.6 బిలియన్ డాలర్లు, ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ వ్యాల్యూ మాత్రం 0.5 శాతం క్షీణించి 45.6 బిలియన్ డాలర్లుగా నిలిచింది. ఐసీఐసీఐ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 316, ఐటీసీ 480వ స్థానంలో నిలిచాయి. ఐటీసీ 22 శాతం లాభపడి 32.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. దేశంలో 239 నాన్-ఇండియా హెడ్ క్వార్టర్ కంపెనీలు ఉన్నాయి. ఉన్న వాటిలో ఎక్కువగా ముంబైలో ఉన్నాయి. టాప్ 11 కంపెనీల్లోని 7 కంపెనీల ప్రధాన కార్యాలయాలు ముంబైలో ఉండగా, మిగతా నాలుగు కంపెనీల ఆఫీస్‌లు పుణే, బెంగళూరు, కోల్‌కతా, న్యూఢిల్లీలో ఉన్నాయి.

ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్...
టాప్ 500 జాబితాలో కన్స్యూమర్ టెక్నాలజీ మెజర్ ఆపిల్ 2.1 ట్రిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్, అమెజాన్ 1.6 ట్రిలియన్ డాలర్లతో ఉన్నాయి. 242 కంపెనీలు అమెరికావి, 51 కంపెనీలు చైనావి, జపాన్‌కు చెందిన కంపెనీలు 30 ఉన్నాయి. వ్యాల్యుయేషన్ పరంగా చైనా కంపెనీల మార్కెట్ క్యాప్ 73 శాతం పెరిగింది.