PPO number: ఈపీఎఫ్ పెన్షన్ PPO నెంబర్‌ను తెలుసుకోండి ఇలా
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) రిటైర్ అయ్యే ప్రతి ఉద్యోగికి పెన్షన్ పేమెంట్ ఆర్డర్(PPO) వివరాలకి సంబంధించిన లేఖను పంపిస్తుంది. అంటే ఈపీఎస్ పరిధిలోకి వచ్చే పెన్షనర్లకు ప్రత్యేకమైన PPO నెంబర్‌ను కేటాయిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ డిస్బర్స్మెంట్ కోసం దీనిని అందిస్తుంది. సెంట్రల్ పెన్షన్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ (CPAO)తో ఏదైనా కమ్యూనికేషన్ కోసం ఇది రిఫరెన్స్ నెంబర్. పీపీవో నెంబర్ పెన్షన్ పొందడానికి సహకరిస్తుంది. ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేటప్పుడు ఈ పీపీవో నెంబర్‌ను పేర్కొనడం ముఖ్యం. పీపీవో నెంబర్ పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందే ఉద్యోగులు ఈ నెంబర్‌ను తప్పకుండా తెలుసుకోవాలి.

12 అంకెల నెంబర్
పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ 12 అంకెలు కలిగిన నెంబర్. ఇందులో మొదటి అయిదు అంకెలు పీపీవో జారీ చేసే అథారిటీ కోడ్‌ను, తర్వాత రెండు అంకెలు, నెంబర్ జారీ చేసిన సంవత్సరాన్ని, ఆ తర్వాత నాలుగు అంకెలు పీపీవో సీక్వెన్షియల్ నెంబర్, చివరి అంకె కంప్యూటర్ చెక్ కోడ్‌ను సూచిస్తాయి. సబ్స్క్రైబర్లు పీపీవో నెంబర్ పొందడానికి ఈ ఇలా చేయాలి...

ఈ వెబ్ సైట్ ద్వారా...
మొదట ఈపీఎఫ్ఓ ఇండియా వెబ్సైట్లోకి లాగ్-ఇన్ కావాలి. తర్వాత సర్వీసెస్‌లోని పెన్షన్ పోర్టల్ పైన క్లిక్ చేయాలి. ఇది పెన్షనర్లకు పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. వెల్కం టు పెన్షనర్స్ పోర్టల్ అనే సందేశం వస్తుంది. ఇప్పుడు కుడివైపున ఉన్న నో యువర్ పీపీవో నెంబర్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీ బ్యాంకు ఖాతా నెంబర్ లేదా మెంబర్ ఐడీని ఎంటర్ చేయాలి. ఈ వివరాలు ఇస్తే పీపీఎఫ్ నెంబర్‌తో పాటు సభ్యత్వ ఐడీ, పెన్షన్ రకం తదితర సమాచారం కూడా అందుతుంది. ఇక్కడ పెన్షన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేటప్పుడు పీపీవో నెంబర్ అవసరం. పీపీవో నెంబర్ తెలియకుంటే పీఎఫ్ ఖాతాకు ఒక బ్యాంకు శాఖ నుండి మరో బ్యాంకుకు బదలీ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఉద్యోగులకు
ఈపీఎఫ్‌లో ఓ భాగం ఈపీఎస్. ఈపీఎఫ్ఓలో సభ్యులైన ఉద్యోగులకు వర్తిస్తుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల వలె ప్రయివేటు రంగంలోని ఉద్యోగులు కూడా పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ పొందవచ్చు. ఉద్యోగి మరణించిన తర్వాత కూడా నామినీ ఈ పెన్షన్ పొందవచ్చు. ఉద్యోగి, సంస్థ 12 శాతం చొప్పున ఉద్యోగి వేతనానికి సమానమైన మొత్తాన్ని ప్రతి నెల ఈపీఎప్లో జమ చేస్తారు. సంస్థ వాటా 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్‌కు వెళ్తుంది. మిగతా 3.67 శాతం ఈపీఎఫ్‌కు చేరుతుంది.