Loan Moratorium: క్యాష్ బ్యాక్ ఇలా వస్తుంది, కేంద్రంపై రూ.7,500 కోట్ల భారం
రుణ మారటోరియం కాలంలో చక్రవడ్డీ మాఫీకి సంబంధించి ఖాతాదారుల అకౌంట్లలో డబ్బులు క్రెడిట్ అవుతున్నట్లుగా సందేశాలు వస్తున్నాయి. హోమ్, వెహికిల్, స్టడీ, పర్సనల్ సహా వివిధ రకాల లోన్లు తీసుకుంటే మారటోరియం కాలంలో ఈఎంఐలు చెల్లిస్తే.. ఇందుకు సంబంధించి క్యాష్ బ్యాక్ వస్తుంది. కరోనా నేపథ్యంలో మార్చి 1 నుండి ఆగస్ట్ 31వ తేదీ నాటికి అన్ని రకాల లోన్లపై మారటోరియం విధించడంతో చాలామంది ఈఎంఐలు వాయిదా వేసుకున్నారు. వాయిదాలపై బ్యాంకులు వేసిన చక్రవడ్డీని కేంద్రం రద్దు చేసింది. అలాగే ఈఎంఐలు చెల్లించిన వారికి బ్యాంకులు లెక్కగట్టి ఖాతాల్లో డబ్బును జమ చేస్తుంది.
మారటోరియం వడ్డీ మాఫీ: వీరికి ఎక్స్గ్రేషియా ఊరటలేదు... కేంద్రం స్పష్టత

కేంద్ర ప్రభుత్వంపై రూ.7500 కోట్ల భారం
చక్రవడ్డీ మాఫీ ప్రయోజనం ద్వారా 40 శాతం మంది సిస్టం క్రెడిట్, 75 శాతం రుణగ్రహీతలు ప్రయోజనం పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై రూ.7,500 కోట్ల మేర భారం పడనుంది. రూ.2 కోట్ల వరకు ఉన్న వివిధ రుణాలపై కేంద్రం రద్దు చేసింది. నవంబర్ 5వ తేదీలోగా రుణగ్రహీతలకు ఇందుకు సంబంధించిన మొత్తాన్ని అందించాలని బ్యాంకులకు సూచించింది.
ఇక, రుణదాతలు డిసెంబర్ 15వ తేదీ వరకు రీయింబర్సుమెంట్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నివేదిక ప్రకారం రూ.2 కోట్ల లోపు రుణాలపై వడ్డీపై వడ్డీ మాఫీ నేపథ్యంలో భారీ ప్రభావం పడటంతో పాటు ఆర్థిక వ్యవస్థకు సవాళ్లతో కూడుకున్నదిగా చెబుతున్నారు.

వారికి ఈఎంఐలలో తగ్గింపు
మారటోరియం కాలంలో ఈఎంఐలు వాయిదా వేసుకున్న వారితో పాటు చెల్లించిన వారికి ప్రయోజనాలు ఉంటాయని కేంద్రం తెలిపింది. ఈఎంఐలు వాయిదా వేసుకునే వారికి బ్యాంకులు, రుణ సంస్థలు చక్రవడ్డీని మాఫీ చేస్తున్నాయి. దీంతో పెరిగిన రుణ కాలపరిమితి, ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తాలు తగ్గనున్నాయి. ఇక, ఈఎంఐ చెల్లించిన వారికి సాధారణ వడ్డీ, చక్రవడ్డీకి ఉన్న తేడాను వారి ఈఎంఐలలో తగ్గిస్తున్నారు.

ఇలా అందుతున్నాయి..
ఏదైనా బ్యాంకు నుండి మీరు తీసుకున్న రుణానికి తదుపరి నెల చెల్లించే ఈఎంఐలో తగ్గింపు ద్వారా చక్రవడ్డీకి సంబంధించిన ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఉదాహరణకు మీ ఈఎంఐ నెలకు రూ.30వేలు అయితే, చక్రవడ్డీ ద్వారా మీకు కలిగే ప్రయోజనం రూ.3వేలు అయితే, తదుపరి నెల ఈఎంఐలో రూ.27వేలు చెల్లించాలి. కొన్ని సంస్థలు తమ రుణగ్రహీతలకు చక్రవడ్డీ రద్దు ప్రయోజనాన్ని వారి వారి ఖాతాల్లో నగదు రూపంలో జమ చేస్తున్నాయి. చక్రవడ్డీ మాఫీ ప్రయోజనం బ్యాంకుల్లో జమ చేసినట్లయితే మెసేజ్ వస్తుంది.