ప్రపంచంలోనే అత్యధిక బంగారు నిల్వలు కలిగిన శక్తివంతమైన దేశాలలో రష్యా ఒకటని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల రష్యా సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం అంతర్జాతీయ ఆర్థిక నిపుణులను, ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2026 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (జనవరి నుండి జూన్ వరకు) రష్యా తన ఖజానా నుండి ఏకంగా 44 టన్నుల (సుమారు 1.4 మిలియన్ ట్రాయ్ ఔన్సులు) బంగారాన్ని విక్రయించిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో ఉన్న తరుణంలో రష్యా ఈ స్థాయి అమ్మకాలకు తెగబడటం అనేక సందేహాలకు, చర్చలకు దారితీస్తోంది.

Advertisement

రష్యన్ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం.. 2026 జూలై ప్రారంభం నాటికి ఆ దేశం వద్ద 73.4 మిలియన్ ట్రాయ్ ఔన్సులు, అంటే సుమారు 2,282 మెట్రిక్ టన్నుల పసిడి నిల్వలు** మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇది ఈ సంవత్సరం ప్రారంభంతో పోలిస్తే దాదాపు 43.5 టన్నులు తక్కువగా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 2020 తర్వాత రష్యా వద్ద ఉన్న Gold నిల్వలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం రష్యా వద్ద ఉన్న ఈ మిగిలిన పసిడి నిల్వల మొత్తం విలువ అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం 299 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 లక్షల కోట్లు)గా అంచనా వేస్తున్నారు.

Advertisement

సాధారణంగా ఏ దేశానికైనా దాని వద్ద ఉండే బంగారు నిల్వలు ఆర్థిక స్థిరత్వానికి, విదేశీ మారక నిల్వల బలానికి ప్రతిరూపంగా నిలుస్తాయి. అత్యవసర సమయాల్లో లేదా ఆర్థిక సంక్షోభాల్లో దేశ రూకలను కాపాడేందుకు ఇవి ఉపయోగపడతాయి. అయితే రష్యా విషయంలో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా, ఐరోపా దేశాలు విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షలు తీవ్ర ప్రతిబంధకంగా మారాయి. ఈ ఆంక్షల కారణంగా రష్యా సెంట్రల్ బ్యాంక్ అంతర్జాతీయ మార్కెట్లలో నేరుగా తమ Gold విక్రయించి విదేశీ కరెన్సీని పొందే అవకాశాన్ని కోల్పోయింది.

Advertisement
పసిడి ప్రియుల కొంపలు ముంచబోతున్న చైనా.. బంగారం ధరలు పెంచేందుకు బిగ్ స్కెచ్..

దీంతో ఈ నిల్వలను స్థానిక రష్యన్ బ్యాంకులు.. ఓటీసీ (OTC) మార్కెట్లు లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విక్రయిస్తూ నిధులను సమకూర్చుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ బంగారాన్ని ఏ నిర్దిష్ట కొనుగోలుదారులకు విక్రయించారనే విషయాన్ని కేంద్ర బ్యాంకు అధికారికంగా వెల్లడించలేదు.

రష్యా ఈ స్థాయిలో విక్రయాలు జరిపినప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలపై తక్షణ ప్రతికూల ప్రభావం పడకపోవడం విశేషం. ప్రస్తుతం ప్రపంచ బంగారం ధరలను కేవలం సరఫరా మాత్రమే కాకుండా పశ్చిమ ఆసియాలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలు, చైనా, పోలాండ్ వంటి ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు జరుపుతున్న భారీ కొనుగోళ్లు, గ్లోబల్ ద్రవ్యోల్బణ ఆందోళనలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రధానంగా ప్రభావితం చేస్తున్నాయి. అయినప్పటికీ రష్యా బడ్జెట్ లోటును భరించడానికి భవిష్యత్తులో కూడా తమ బంగారు నిల్వలను మరిన్ని విక్రయించే అవకాశం ఉందని.. అది ప్రపంచ పసిడి మార్కెట్ ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేదానిపై నిపుణులు ఆసక్తిగా గమనిస్తున్నారు.