పశ్చిమ ఆసియాలో రోజురోజుకూ తీవ్రమవుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాలు కలవరపాటుకు గురి అవుతున్నాయి. మధ్యప్రాచ్యం రగిలిన అగ్నిజ్వాలలు రోజురోజుకూ భీకర రూపం దాల్చుతున్నాయి. అమెరికా - ఇరాన్‌ల మధ్య ప్రారంభమైన ఈ ప్రత్యక్ష పోరాటం, ఇప్పుడు కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా మొత్తం పశ్చిమ ఆసియా ప్రాంతాన్ని ఒక వినాశకరమైన యుద్ధంలోకి నెట్టివేసే స్థాయికి చేరుకుంది.

Advertisement

వరుసగా పదో రాత్రి కూడా యూఎస్ సెంట్రల్ కమాండ్ నేతృత్వంలో అమెరికా వైమానిక దళాలు ఇరాన్ భూభాగంపై విరుచుకుపడ్డాయి. ఇరాన్ మిలిటరీ కమాండ్ కేంద్రాలు, క్షిపణి, డ్రోన్ ప్రయోగ స్థావరాలు, వ్యూహాత్మక వాయు రక్షణ వ్యవస్థలతో పాటు ప్రాముఖ్యత కలిగిన నావికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అంతర్జాతీయ జలసంధి అయిన హార్ముజ్ గుండా ప్రయాణించే వాణిజ్య, చమురు నౌకల భద్రతను కాపాడటానికే ఈ చర్యలని అమెరికా సమర్థించుకుంటున్నప్పటికీ.. ఈ దాడుల పరిధి క్రమంగా పెరుగుతోంది.

Advertisement

ముఖ్యంగా దక్షిణ ఇరాన్ పరిధిలోని కీలకమైన బందర్ అబ్బాస్ ఓడరేవు, ఖేష్మ్ ద్వీపం, చబహార్ పరిసర ప్రాంతాలలో భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బుషెహర్ ప్రాంతంలో ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు నిరంతరం క్రియాశీలంగా మారి శత్రు క్షిపణులను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య, ఇరాన్ ప్రాపకం ఉన్న యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు రంగంలోకి దిగడంతో పరిణామాలు మరింత దారుణంగా మారాయి.

ఎర్రసముద్రం, బాబ్-ఎల్-మండేబ్ జలసంధి ప్రాంతాల్లో వాణిజ్య నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో తాజా దాడులకు తెగబడటమే కాకుండా.. సౌదీ అరేబియాపై నావికా దిగ్బంధనం (Naval Blockade) విధిస్తామని హౌతీలు బహిరంగంగా హెచ్చరించారు. ఈ తాజా హౌతీ దాడులు ప్రాంతీయ రవాణా భద్రతను పూర్తిగా అస్తవ్యస్తం చేయడంతో పాటు యుద్ధం ఇతర అరబ్ దేశాలకు వ్యాపించే సంకేతాలను ఇస్తున్నాయి.

Advertisement
అమెరికా-ఇరాన్ యుద్ధంలో కీలక మలుపు.. జీరో అవర్ హెచ్చరికతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన..

ఈ ప్రాంతీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై తక్షణ ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఒమన్ తీరానికి సమీపంలో హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న రెండు ప్రధాన చమురు ట్యాంకర్లపై పేలుళ్లు సంభవించి అవి మంటల్లో చిక్కుకోవడం అంతర్జాతీయంగా చమురు మార్కెట్లను కుదిపేసింది. దాడులకు గురైన నౌకల్లోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించినప్పటికీ.. అమెరికా తన వైమానిక దాడులను ఆపకపోతే గ్లోబల్ ఎనర్జీ రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ డ్రాస్టిక్ హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచానికి అవసరమైన ముడి చమురులో గణనీయమైన భాగం ఈ మార్గం గుండానే సరఫరా అవుతున్నందున.. ఈ హెచ్చరిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త వణుకు పుట్టించింది.

Advertisement

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యాఖ్యలతో వైఖరిని మరింత కఠినతరం చేశారు. ఈ యుద్ధ వాతావరణంలో ఏ ఒక్క అమెరికన్ సైనికుడైనా ప్రాణాలు కోల్పోతే.. ఇరాన్ దానికి అనేక రెట్లు ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఒకవైపు అమెరికా క్షిపణి దాడులు, మరోవైపు ఇరాన్ ప్రతిఘటన, ప్రత్యక్ష బెదిరింపులు, దీనికి అదనంగా ఎర్రసముద్రం, సౌదీ సరిహద్దులలో హౌతీ తిరుగుబాటుదారుల విధ్వంసకర దాడులు కలసి మొత్తం పశ్చిమ ఆసియాను ఒక శ్మశానాల దిబ్బగా మార్చేశాయి. శాంతి చర్చల ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో.. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణానికి, రవాణా సంక్షోభానికి, సుదీర్ఘ ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తాయేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.