గత నెలలో బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా యూకే ప్రభుత్వం తాజాగా 16, 17 ఏళ్ల వయస్సు గల టీనేజర్ల కోసం రాత్రిపూట సోషల్ మీడియా కర్ఫ్యూను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది.

Advertisement

పిల్లలను సోషల్ మీడియా వ్యసనానికి గురిచేస్తున్న యాప్‌లను కట్టడి చేయడంలో భాగంగా ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. 16-17 ఏళ్ల వయస్సు వారు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లను అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉపయోగించడానికి వీలుండదు.

Advertisement

ఈ కర్ఫ్యూతో పాటుగా.. టీనేజర్లను స్క్రీన్‌లకు అతుక్కుపోయేలా చేసే ఇన్ఫినిట్ స్క్రోలింగ్ వంటి వ్యసనకరమైన ఫీచర్లను నిలిపివేసేలా డిఫాల్ట్ సెట్టింగ్‌లను కూడా ప్రభుత్వం తీసుకురానుంది. అయితే, వినియోగదారులు కావాలనుకుంటే ఈ సెట్టింగ్‌లను మాన్యువల్‌గా ఆఫ్ చేసుకునే వెసులుబాటు ఉండటం గమనార్హంగా చెప్పుకోవచ్చు. దీనిపై విమర్శకులు స్పందిస్తూ.. ఈ వెసులుబాటు వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుందని, ఆంక్షలు అంత ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

అంతేకాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చాట్‌బాట్‌ల వినియోగంపై కూడా నిఘా ఉంచనున్నారు. 18 ఏళ్లలోపు వారు ఈ ఏఐ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు క్రమం తప్పకుండా విరామం తీసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. అయితే ఈ మార్పులను టెక్ కంపెనీలు వాస్తవ రూపంలో ఎలా అమలు చేస్తాయనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

యువత 16 ఏళ్ల వయసులో కాస్త స్వాతంత్ర్యం కోరుకున్నప్పటికీ.. వారి మానసిక, శారీరక శ్రేయస్సుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపే ఆన్‌లైన్ వ్యసనాల నుంచి వారిని రక్షించాల్సిన బాధ్యత ఉందని టెక్నాలజీ శాఖ మంత్రి లిజ్ కెండల్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

టీనేజర్లు నిద్రలేమితో బాధపడకుండా తగినంత విశ్రాంతి పొందడానికి.. వారి చదువులపై ఏకాగ్రత వహించడానికి, స్నేహితులు, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఈ చర్యలు అత్యంత కీలకమని ఆమె ఉద్ఘాటించారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ సంస్కరణలను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రక్షణ చర్యలుగా స్వాగతిస్తుండగా.. మరికొన్ని సంస్థలు మాత్రం ఈ ఆంక్షల వల్ల పిల్లలు ఇంటర్నెట్‌ను ఇతర అసురక్షిత మార్గాల్లో వినియోగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.

Advertisement

అంతర్జాతీయంగా చూసుకుంటే.. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాలను అరికట్టేందుకు పలు దేశాలు ఇప్పటికే కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి. గతేడాది డిసెంబర్‌లో 16 ఏళ్లలోపు వారిని సోషల్ మీడియా నుంచి నిషేధించిన మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలవగా.. ఈ ఏడాది మార్చిలోనే ఇండోనేషియా సైతం ఇలాంటి నిషేధాన్ని అమలు చేయడం ప్రారంభించింది.

కెనడా, యూఏఈ వంటి దేశాలు కూడా ఇలాంటి చర్యలనే ప్రకటించాయి. ఇప్పుడు యూకే కూడా ఇదే జాబితాలో చేరింది. 16 ఏళ్లలోపు వారి కోసం స్నాప్‌చాట్, టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర ప్లాట్‌ఫారమ్‌లపై విధించిన నిషేధంతో పాటు, ఈ కొత్త కర్ఫ్యూ నిబంధనలు కూడా 2027 ప్రారంభం నాటికి పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి.