స్పేస్ ఎక్స్ చెందిన రాకెట్ నుంచి విడిపోయిన ఒక భాగం చంద్రుడిని ఢీకొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం నుంచి అంతరిక్షంలో తేలుతున్న ఈ భాగం ఈ రోజు చంద్రుడిని ఢీకొట్టినట్లు చెబుతున్నారు. నాలుగు టన్నుల బరువున్న ఒక ముక్క అనుకోకుండా అధిక వేగంతో చంద్రుడిని ఢీకొట్టిందని భావిస్తున్నారు. ఈ ఢీకొనడం వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ చంద్రుడిపై ఒక కొత్త గొయ్యి ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఒక భవనం పరిమాణంలో ఉన్న ఈ వస్తువు 2025 జనవరిలో అమెరికాకు చెందిన ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ సంస్థ చంద్రుడి వైపు పంపిన లూనార్ ల్యాండర్‌ను ప్రయోగించిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌కు చెందిన భాగంగా చెబుతున్నారు.

Advertisement

ఈ రాకెట్ భాగం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.05 గంటల ప్రాంతంలో గంటకు 5,400 మైళ్ల (8,690 కిలోమీటర్ల) వేగంతో చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టినట్టు అంచనా వేస్తున్నారు. ఈ తాకిడి వల్ల మైళ్ల పొడవునా చంద్ర ధూళి మేఘం పైకి లేస్తుందని, అది సూర్యకాంతిలో ప్రకాశించినప్పటికీ దాన్ని భూమి నుంచి కంటితో గుర్తించడం కష్టమని శాస్త్రవేత్తలు తెలిపారు. అధిక నాణ్యత గల టెలిస్కోపులు, కెమెరాల ద్వారా చూడవచ్చని చెబుతున్నారు. రాకెట్ నుంచి విడిపోయిన భాగం చంద్రుడిని ఢీ కొట్టడం వల్ల సుమారు 60 అడుగుల (18 మీటర్ల) వెడల్పు, 12 అడుగుల (నాలుగు మీటర్ల) లోతు గల ఒక గొయ్యి ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

ఈ రాకెట్ పైభాగం చంద్రుడి పైకి బ్లూ ఘోస్ట్ మిషన్‌ను ప్రయోగించాక 19 నెలల పాటు అంతరిక్షంలో తేలుతూ ఉంది. ఇవాళ ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.
2025 జనవరి 15న స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌ ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇది దశలవారీగా విడిపోతూ చంద్రుడిపైకి రాకెట్ పైభాగం మాత్రమే వెళ్లింది. అక్కడ ఈ రాకెట్ పైభాగం మాత్రమే చంద్రుడిని ఢీకొట్టినట్లు సమాచారం. అసలు రాకెట్ నుంచి విడిపోయిన తర్వాత ఇది మండుతూ చంద్రుడిపైకి వెళ్తుందని... ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ రాకెట్ ఇంధనం అయిపోయిన తర్వాత, సౌర కార్యకలాపాలు, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి క్రమంగా రాకెట్ దశ గమనాన్ని మార్చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ తాకిడి వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా ప్రతినిధి జిమీ రస్సెల్ తెలిపారు. నాసా శాస్త్రవేత్తలు ఈ సంఘటకు సంబంధించి చంద్రుడి నుంచి డేటాను సేకరించనున్నారు. స్టేజెస్ అని పిలువబడే ఇటువంటి రాకెట్ భాగాలు, రాకెట్ పేలోడ్‌ను కక్ష్యలోని ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేర్చిన తర్వాత, సాధారణంగా భూమి వాతావరణంలోకి తిరిగి పడిపోయి కాలిపోతాయి లేదా సముద్రంలో కూలిపోతాయి. కానీ, భూమికి దగ్గరగా ఉండే మిషన్ల కంటే జనవరి 2025 లూనార్ ల్యాండర్ మిషన్‌కు ఎక్కువ చోదక శక్తి అవసరం అయినందున, రాకెట్ రెండవ దశ అంతరిక్షంలోనే ఉండిపోయింది. క్రియాశీల ఉపగ్రహాలు తప్పనిసరిగా దూరంగా ఉండవలసిన వేలాది ఇతర అంతరిక్ష వ్యర్థాల మధ్య అది లక్ష్యం లేకుండా తేలుతూ ఉండిపోయిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.