ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక సదుపాయాల రంగానికి కొత్త కళ తెస్తూ.. విశాఖపట్నం సమీపంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం విమానాశ్రయం) ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

Advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు జీఎంఆర్ గ్రూప్ అధినేత జి. మల్లిఖార్జనరావు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

ఈ ప్రారంభోత్సవ వేడుకలలో ఉత్తరాంధ్ర సాంస్కృతిక సమ్మేళనం ప్రతిబింబించింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల నుండి విచ్చేసిన దాదాపు 13,750 మంది గిరిజన మహిళలు, విద్యార్థినులు ఏకకాలంలో ధింసా నృత్యం చేసి ప్రధానికి అపూర్వ స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ప్రధాని మోదీ ఈ వినూత్న ప్రదర్శనను వీక్షించి అభినందించారు. అనంతరం విమానాశ్రయంలోని ప్రయాణికుల చెక్-ఇన్ హాల్, అధునాతన ఏఐ (AI) డిజిటల్ వ్యవస్థలను స్వయంగా పరిశీలించారు.

Bhogapuram ప్రాజెక్టు - ప్రధాన అంశాలు: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రూపుదిద్దుకున్న ఏకైక అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఇది. జీఎంఆర్ (GMR) సంస్థ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్షిప్ (PPP) నమూనాలో దీనిని నిర్మించింది.

Advertisement

మొత్తం వెచ్చించిన వ్యయం: రూ. 4,700 కోట్లకు పైగానే
మొత్తం విస్తీర్ణం: 2,200 ఎకరాలు (భవిష్యత్ అవసరాల కోసం మరో 500 ఎకరాల కేటాయింపు)
రన్‌వే సామర్థ్యం: 3,800 మీటర్ల సుదీర్ఘ రన్‌వే (బోయింగ్ 777, ఎయిర్‌బస్ A350 వంటి భారీ విమానాలు ల్యాండ్ అయ్యే వెసులుబాటు)
ప్రయాణికుల రద్దీ: ప్రాథమిక దశలో ఏడాదికి 60 లక్షల మంది, రాబోయే రోజుల్లో 4 కోట్ల మంది ప్రయాణించేలా ప్రణాళిక.
ఆధునిక సాంకేతికత: 275 కిలోమీటర్ల తుఫాను గాలులను తట్టుకునే గ్లాస్ స్ట్రక్చర్ మరియు క్యాట్-I ల్యాండింగ్ సిస్టమ్.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు VTZ కోడ్.. విశాఖ ఎయిర్‌పోర్టులో షెడ్యూల్డ్ వాణిజ్య విమాన కార్యకలాపాలకు గుడ్ బై..
Advertisement

విశాఖ పాత విమానాశ్రయం నుంచి భోగపురానికి ఎందుకు?: ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ దేగా (INS Dega) ఎయిర్‌పోర్ట్ నావికాదళ వైమానిక స్థావరం పరిధిలో ఉంది. సైనిక భద్రతా కారణాల వల్ల అక్కడ పౌర విమానాల రాకపోకలపై తీవ్ర సడలింపులు, ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అంతేకాకుండా చుట్టూ నావీ భూములు ఉండటంతో అక్కడ రన్‌వేను పొడిగించడం కానీ, పెద్ద విమానాలకు పార్కింగ్ బేలు నిర్మించడం కానీ అసాధ్యంగా మారింది.

మరోవైపు భోగపురం ప్రాంతం.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మూడూ ఉత్తరాంధ్ర జిల్లాలకు సమాన దూరంలో జాతీయ రహదారి 16 (NH-16)కి ఆనుకుని ఉంది. రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఐఎన్ఎస్ దేగాను పూర్తిస్థాయి మిలిటరీ నావల్ బేస్‌గా తీర్చిదిద్దేందుకు మొగ్గు చూపడంతో భోగపురం వద్ద నూతన ఎయిర్‌పోర్ట్ నిర్మాణం అనివార్యమైంది.

Advertisement

ఆగస్టు 17 నుండి వాణిజ్య సర్వీసులు: ఆగస్టు 1న విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసినప్పటికీ, అధికారికంగా ఆగస్టు 17 నుండి పౌర విమానాల వాణిజ్య సేవలు (Commercial Operations) ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. విశాఖ పాత ఎయిర్‌పోర్ట్‌లో పౌర విమానాల రాకపోకలు నిలిపివేసి, పూర్తి సర్వీసులను భోగపురానికి తరలించనున్నారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో కోల్డ్-చైన్ సదుపాయాలతో కూడిన ప్రత్యేక కార్గో టెర్మినల్ ద్వారా సీఫుడ్, ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగి ఉత్తరాంధ్ర పారిశ్రామిక, పర్యాటక రంగం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆశిస్తున్నారు.

ఎయిరిండియా ఫ్లైట్‌ షెడ్యూల్‌ విడుదల: ఎయిరిండియా (Air India) అక్టోబర్ 24 వరకు అమల్లో ఉండే విమానాల షెడ్యూల్‌ను ప్రకటించింది.ఈ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్-భోగాపురం మార్గంలో ప్రతిరోజూ ఐదు విమాన సర్వీసులు నడవనున్నాయి. అలాగే బెంగళూరు-భోగాపురం మధ్య రోజుకు రెండు సర్వీసులు అందుబాటులో ఉండగా, ఆదివారం, శుక్రవారం మినహా మిగిలిన ఐదు రోజుల్లో అదనంగా మరో సర్వీసును నిర్వహించనున్నారు. అదేవిధంగా విజయవాడ-భోగాపురం మధ్య ప్రతిరోజూ నాలుగు విమాన సర్వీసులు నడపనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. కొత్త విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి దేశంలోని ప్రధాన నగరాలతో వైమానిక అనుసంధానం మరింత మెరుగుపడనుంది.