భారత బ్యాంకింగ్ రంగంలో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ.. దేశంలోనే మొట్టమొదటిసారిగా పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక అడుగులు వేస్తోంది. దాదాపు శతాబ్ద కాలంగా డబ్బు ముద్రణ కోసం కేవలం ప్రత్యేక కాగితంపైనే ఆధారపడిన ఆర్బీఐ.. ఇప్పుడు అధునాతన భద్రతా ఫీచర్లతో కూడిన పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్ల సరఫరా కోసం అంతర్జాతీయంగా టెండర్లను ఆహ్వానించింది.

Advertisement

ఆర్బీఐకి చెందిన కరెన్సీ ముద్రణ విభాగమైన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (BRBNMPL) ఈ టెండర్లను జారీ చేస్తూ.. అర్హులైన దేశీయ, అంతర్జాతీయ తయారీదారులను ఆగస్టు 18 లోగా బిడ్లు సమర్పించాల్సిందిగా కోరింది. అయితే ఈ నోట్లను ఏ ఏ ముఖ విలువలలో ప్రవేశపెడతారు.. వీటికి సంబంధించిన కాలపరిమితి ఏమిటనేది ప్రస్తుతానికి రహస్యంగా ఉంచారు.

Advertisement

దేశ రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ టెండర్‌లో కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన జాతీయ భద్రతా నిబంధనలను విధించింది. బిడ్లు దాఖలు చేసే సంస్థలు తప్పనిసరిగా భారత ప్రభుత్వం నుండి భద్రతా అనుమతి (Security Clearance) పొందాల్సి ఉంటుంది. అంతేకాకుండా చైనా లేదా పాకిస్తాన్ దేశాలలో సదరు కంపెనీలకు ఉన్న వ్యాపారాలు లేదా కార్యకలాపాలను ఈ భారతీయ ఒప్పందం నుండి పూర్తిగా వేరుగా ఉంచాలి.

రూ.100, రూ.200 నోట్లను ఇళ్లలో దాచుకుంటున్న ప్రజలు.. అసలు కారణం ఏమిటి?..

భారతదేశానికి సరఫరా చేసే ప్రత్యేక కరెన్సీ సబ్‌స్ట్రేట్ తయారీ కోసం ఈ రెండు దేశాల నుండి ఎలాంటి ముడి పదార్థాలను సేకరించకూడదని.. అలాగే భారతదేశం కోసం రూపొందించిన ఈ ప్రత్యేక సబ్‌స్ట్రేట్‌ను మరే ఇతర మూడవ దేశానికి సరఫరా చేయబోమని కంపెనీలు గ్యారంటీ ఇవ్వవలసి ఉంటుంది. ఈ టెండర్‌లో పాల్గొనడానికి అంతర్జాతీయ కంపెనీలకు కనీసం గత మూడు సంవత్సరాలుగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులకు పాలిమర్ సబ్‌స్ట్రేట్‌ను సరఫరా చేసిన అనుభవం ఉండాలి. ప్రారంభంలో ప్రయోగాత్మక పరిశీలనల కోసం రెండు డినామినేషన్‌లకు ఒక్కొక్కదానికి 34 వేల చొప్పున మొత్తం 68 వేల రీముల షీట్లను సేకరించనున్నారు. ఈ క్షేత్రస్థాయి పరీక్షలు విజయవంతమైతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పాలిమర్ నోట్ల కొనుగోళ్లు జరుపుతారు.

Advertisement

మన్నికైన ప్లాస్టిక్ ఫిల్మ్‌లతో తయారయ్యే ఈ పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్ల కంటే ఎక్కువ కాలం మన్నుతాయి.అంత సులభంగా చిరిగిపోవు. అందువల్ల మార్కెట్లో పాడైపోయిన నోట్లను పదే పదే మార్చాల్సిన అవసరం ప్రభుత్వానికి తప్పుతుంది. డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ దేశంలో నగదుకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. మార్చి 2026 చివరి నాటికి చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ 12 శాతం పెరిగి రూ. 41.23 లక్షల కోట్లకు చేరింది.

ఇందులో రూ. 500 నోట్లు అత్యధికంగా 86 శాతం వాటాను కలిగి ఉన్నాయి. కరెన్సీ-జీడీపీ నిష్పత్తి కూడా గత ఏడాది 11.7 శాతం నుండి 12.1 శాతానికి పెరిగింది. అయినప్పటికీ ముద్రణ అవసరాలు తగ్గడం వల్ల 2025-26 ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణ ఖర్చులు పావు వంతు తగ్గి రూ. 4,875 కోట్లకు చేరినట్లు ఆర్బీఐ వార్షిక నివేదిక పేర్కొంది. రాబోయే రోజుల్లో పాలిమర్ నోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఆర్బీఐకి కరెన్సీ నిర్వహణ ఖర్చులు మరింతగా తగ్గే అవకాశం ఉంది.