భారతీయ గృహ నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగంలో త్వరలోనే భారీ స్థాయిలో ఆస్తుల రీసేల్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రీ సేల్ డెవలపర్ల నుండి కాకుండా, భారతదేశంలో తమకున్న ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటున్న ప్రవాస భారతీయుల (NRI) నుండి రానుంది. వాంకోవర్ ఆధారిత వెల్త్ టెక్ స్టార్టప్ రెమిట్టర్ విడుదల చేసిన యాన్యువల్ ఎన్ఆర్ఐ వెల్త్ రిపోర్ట్ 2026 ప్రకారం.. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ సంపద నిర్వహణలో ఒక పెద్ద నిర్మాణాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు. 2010 నుండి 2019 మధ్యకాలంలో కొనుగోలు చేసిన ఆస్తులు ఇప్పుడు ద్రవ్యత్వ దశలోకి ప్రవేశించడమే దీనికి ప్రధాన కారణం.

Advertisement

ఈ సర్వేలో పాల్గొన్న ఎన్ఆర్ఐ ఆస్తి యజమానులలో దాదాపు 46.4 శాతం మంది తమ ఆస్తులను తక్షణమే విక్రయించాలని భావిస్తుండగా.. మరో 26.2 శాతం మంది రాబోయే ఆరు నెలల వ్యవధిలో నిష్క్రమించాలని యోచిస్తున్నారు. చారిత్రాత్మకంగా భారతీయ ఆస్తులను పదవీ విరమణ ప్రణాళికగా.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల నివాసంగా లేదా స్వదేశంతో భావోద్వేగ బంధంగా పరిగణించిన ప్రవాసులు.. ఇప్పుడు వాటిని కేవలం ఆర్థిక ఆస్తులుగానే చూస్తున్నారు. సగానికి పైగా ఎన్ఆర్ఐలు ఆస్తి విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును భారతదేశంలో తిరిగి పెట్టుబడి పెట్టడానికి బదులుగా.. విదేశాల్లో అధికంగా ఉన్న తనఖా ఖర్చులు, పిల్లల విద్యా ఖర్చులు, పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణ, పన్ను బాధ్యతల నిమిత్తం విదేశాలకు తరలించాలని భావిస్తున్నారు.

Advertisement

పునఃవిక్రయ మార్కెట్‌లోకి వస్తున్న ఆస్తులలో నివాస గృహాలే అత్యధికంగా ఉన్నాయి. అమ్మకానికి వస్తున్న మొత్తం ఆస్తులలో 88.8 శాతం నివాస గృహాలు కాగా.. అందులో 63.2 శాతం కేవలం అపార్ట్‌మెంట్లే కావడం విశేషం. పారదర్శక డాక్యుమెంటేషన్, రెరా (RERA) నిబంధనలు, సులభమైన రీసేల్ సౌకర్యం ఉండటం వల్ల అపార్ట్‌మెంట్లకు ప్రాధాన్యత పెరిగింది. వాణిజ్య ఆస్తులు, వ్యవసాయ భూములు అతి స్వల్ప వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి. ఇక ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. ఈ నిష్క్రమణల ధోరణిలో మహారాష్ట్ర 26.8 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ-ఎన్‌సిఆర్, కేరళ, గుజరాత్, కర్ణాటక ఉన్నాయి. గత దశాబ్దంలో ఈ ప్రాంతాల్లో ఆస్తుల విలువ గణనీయంగా పెరగడంతో లాభాలను స్వీకరించేందుకు ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement
ఇండియాలో రూ.25 కోట్లు బిడ్డను పెంచడానికి సరిపోతాయా..ఎన్నారై దంపతులు సంధించిన ప్రశ్నపై హాట్ డిబేట్..

అయితే ఈ మార్పు ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చిన సంక్షోభం కాదని.. కేవలం సంపద పునఃపంపిణీ మాత్రమేనని నివేదిక స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ ఆస్తుల అమ్మకం అనుకున్నంత సులభంగా జరగడం లేదు. విక్రయదారులలో 81.4 శాతం మందికి ఇంకా సరైన కొనుగోలుదారులు దొరకలేదు. విదేశాల్లో ఉంటూ రిమోట్‌గా డాక్యుమెంటేషన్ నిర్వహించడం ఇబ్బందిగా మారడంతో పాటు, టైర్-I, టైర్-II నగరాల్లో యజమానుల ఊహాజనిత అంచనాలకు.. నిపుణుల వాస్తవ విలువ నిర్ధారణకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉండటం దీనికి ప్రధాన కారణం.

Advertisement

రెమిట్టర్ సీఈఓ సాను నాయర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 18.5 మిలియన్ల భారతీయ వలసదారులు ఉన్నారు. ఎక్కువ మంది భారతీయులు శాశ్వతంగా విదేశాలలో స్థిరపడుతుండటంతో.. వారి ఆర్థిక ప్రాధాన్యతలు స్వదేశంలో ఆస్తులను కూడబెట్టడం కంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన పోర్ట్‌ఫోలియోలను సమర్థవంతంగా నిర్వహించడం వైపు మారుతున్నాయి. ఈ ఆస్తులు ఇప్పుడు ఎన్ఆర్ఐలు తమ స్వదేశంలోని సంపద పోర్ట్‌ఫోలియోలను గరిష్ఠ స్థాయికి పెంచుకోవడానికి, అంతర్జాతీయ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.