ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖపట్నం.. దశాబ్దాలుగా బంగాళాఖాతం తీరాన సముద్ర వాణిజ్యానికి, ఓడల నిర్మాణానికి, భారీ పరిశ్రమలకు, తూర్పు నావికాదళ కమాండ్‌కు నిలయంగా గుర్తింపు పొందింది. అయితే దేశంలో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవానికి డిజిటల్ వెన్నెముకగా రూపాంతరం చెందుతూ ఈ నగరం సరికొత్త అవతారాన్ని ఎత్తుతోంది.
బెంగళూరు, ముంబై, చెన్నై వంటి స్థిరపడిన ఆర్థిక, సాంకేతిక నగరాలు భూమి కొరత, విపరీతమైన రియల్ ఎస్టేట్ ధరలు, మౌలిక వసతుల రద్దీతో సతమతమవుతున్న వేళ.. విశాఖపట్నం విస్తారమైన భూభాగం, తీరప్రాంత సానుకూలతలతో ఒక ప్రతిష్టాత్మక ప్రత్యామ్నాయంగా అవతరిస్తోంది. ఐటీ రాజధానిగా బెంగళూరు..ఆర్థిక రాజధానిగా ముంబై..ఈ నగరాల మాదిరిగానే దేశ ఏఐ రాజధానిగా విశాఖపట్నం అని చెప్పుకునే స్థాయికి విశాఖ నగరం అవతరించబోతోంది.
ఈ భారీ డిజిటల్ రూపాంతరానికి గూగుల్ చేపట్టిన $15 బిలియన్ల (సుమారు ₹1.25 లక్షల కోట్లు) క్లౌడ్ ఏఐ హబ్ ప్రాజెక్ట్ మూలస్తంభంగా నిలిచింది. ఇది ఆసియాలోనే అత్యంత భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటిగా చెప్పుకోవచ్చు. గూగుల్ అడుగుజాడల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా భోగాపురం విమానాశ్రయం సమీపంలో రూ. 1.6 లక్షల కోట్ల వ్యయంతో 1.5 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్ క్లస్టర్.. సబ్‌సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ నిర్మించేందుకు 850 ఎకరాలు కేటాయించుకుంది. వీటితో పాటు సిఫీ (Sify), డిజిటల్ కనెక్షన్, అనిల్ అంబానీ రీసెంట్ ప్రతిపాదనలు కలిపి ఏకంగా రూ. 6 లక్షల కోట్లకు పైగా నిధులు ఈ నగరంలోకి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ నిర్దేశించుకున్న 6 గిగావాట్ల (GW) డేటా సెంటర్ లక్ష్యం దాదాపుగా నెరవేరే దిశగా సాగుతోంది.
AI ప్రమాదకరంగా మారబోతోంది.. AGI రాక ముందే అప్రమత్తం కావాలి.. గూగుల్ డీప్‌మైండ్ CEO సంచలన వ్యాఖ్యలు..
విశాఖ వేగవంతమైన వృద్ధి వెనుక దాని వ్యూహాత్మక భౌగోళిక స్థానం కీలక పాత్ర పోషిస్తోంది. నగరం యొక్క సుదీర్ఘ తీరప్రాంతం సముద్రగర్భ ఫైబర్-ఆప్టిక్ కేబుళ్లకు సరైన ల్యాండింగ్ పాయింట్‌గా మారింది. గూగుల్ అమెరికా-ఇండియా కనెక్ట్ వంటి కార్యక్రమాల ద్వారా ఆస్ట్రేలియా, యూరప్, అమెరికాలను కలిపే.. నీటి అడుగున ఉండే కేబుళ్లు వైజాగ్ గుండా వెళ్తున్నాయి. ఇది డేటా ప్రసారంలో అత్యంత తక్కువ లేటెన్సీని (Latency), అపారమైన బ్యాండ్‌విడ్త్‌ను అందిస్తూ విశాఖను కేవలం దేశీయ సర్వర్ గిడ్డంగిగా కాకుండా గ్లోబల్ డేటా ప్రవాహానికి ప్రధాన ముఖద్వారంగా మారుస్తోంది.
అయితే ఈ స్థాయి వృద్ధి అనేక తీవ్రమైన కార్యాచరణ సవాళ్లను కూడా ముంగిట ఉంచుతోంది. హైపర్-స్కేల్ ఏఐ డేటా సెంటర్లకు అపారమైన విద్యుత్, నీటి శీతలీకరణ (Water Cooling) మౌలిక వసతులు అవసరం. స్థానిక పవర్ గ్రిడ్‌పై ఒత్తిడి పడకుండా, కాలుష్యాన్ని పెంచకుండా ఉండేందుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటా సెంటర్ పాలసీ 4.0 కింద 100 శాతం పునరుత్పాదక శక్తి (సౌర, పంప్డ్ స్టోరేజ్) వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ సవాళ్లను అధిగమిస్తే స్థానిక సప్లై చైన్ వ్యవస్థ పుంజుకోవడంతో పాటు వేలాది మంది హై-టెక్ నిపుణులకు ఉపాధి లభిస్తుంది.
రియల్ ఎస్టేట్, ప్రాజెక్టు ఆధారిత ఆర్థికాంశాల పరంగా చూస్తే.. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, మధురవాడ ఐటీ హిల్స్ పరిసర ప్రాంతాలలో ల్యాండ్ వ్యాల్యూమ్స్ విపరీతంగా పెరిగాయి. ఐటీ కంపెనీలతో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) ఇక్కడ కార్యాలయాలు నెలకొల్పేందుకు మొగ్గు చూపుతున్నాయి. వాణిజ్య రియల్ ఎస్టేట్‌తో పాటు నివాస గృహాల డిమాండ్ పెరగడం ఆర్థిక చక్రానికి ఊతాన్నిస్తోంది.
Visakhapatnam సాధిస్తున్న ఈ సాంకేతిక పరిణామం భారతదేశపు సాంప్రదాయ ఆర్థిక రాజధానులైన ముంబై, బెంగళూరులకు స్పష్టమైన సవాలు విసురుతోంది. సముద్రతీర సౌకర్యం, అపరిమితమైన గ్రీన్ ఎనర్జీ విధానాలు, అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్ నెట్‌వర్క్, ప్రభుత్వ సమర్థవంతమైన సింగిల్ విండో ప్రోత్సాహకాలతో వైజాగ్ సమీప భవిష్యత్తులోనే భారత పారిశ్రామిక, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తిరుగులేని కేపిటల్‌గా అవతరించే దిశగా దూసుకుపోతోంది.
More Articles
- భోగాపురం ఎయిర్‌పోర్ట్ రెడీ.. మరో హైదరాబాద్ కానున్న ఉత్తరాంధ్ర.. ఆగస్టు 1న ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
- విశాఖలో భారీ వర్షాల హెచ్చరిక: ట్రాఫిక్ కష్టాలు మొదలు.. రియల్ ఎస్టేట్ పై ఆ ప్రభావం!
- ఏపీలో ఎబోలా వైరస్‌పై హై అలర్ట్.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన.. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా..
- విశాఖలో 99 పైసలకే 20 ఎకరాలు.. వైజాగ్‌లో శాశ్వత భవనంలోకి మారనున్న ఇన్ఫోసిస్..
- Bengaluru: ఒక్క ట్రైన్‌తో క్లియర్ కానున్న రద్దీ.. బెంగళూరు నుంచి అస్సాం వరకు స్పెషల్ ట్రైన్.. స్టాప్స్ ఇవే..
- Gold rates: బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు! తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..