బంగారం ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో అంతుచిక్కడం లేదు.. ఈ రోజు తగ్గన పసిడి ధరలు రేపు భారీగా పెరుగుతున్నాయి. అలాగే రేపు పెరిగిన ధరలు ఎల్లుండి నేల చూపులు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారం బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

పశ్చిమాసియాలోని భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ద్రవ్యోల్బణ (ఇన్‌ఫ్లేషన్) గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ బలం వంటి అంశాలు పసిడి, వెండి ధరల దిశను నిర్ణయించే అవకాశముందని చెబుతున్నారు. భారతీయ కమొడిటీ మార్కెట్లో సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ పెరిగితే బంగారం బలపడే అవకాశం ఉండగా.. ఆర్థిక గణాంకాలు అంచనాలకు మించి వస్తే ధరలపై ఒత్తిడి పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

గత వారం మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బంగారం, వెండి ధరలు రెండూ గణనీయమైన పతనాన్ని నమోదు చేశాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్ తీవ్ర అప్రమత్తతను పాటిస్తోందని.. రాబోయే రోజుల్లో Gold ధరల హెచ్చుతగ్గులకు ప్రధానంగా ఈ 10 కీలక అంశాలు కారణం కానున్నాయి. ఈ వారం మార్కెట్ ఒత్తిడికి లోనవడానికి అత్యంత ప్రధానమైన కారణం ఏంటంటే అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.

అనధికారిక మార్గంలో వెళ్తున్న ఒక నౌకపై దాడి జరిగినట్లు ఇరాన్ ప్రకటించడం.. ఆపై హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు టెహ్రాన్ వెల్లడించడంతో ఈ వివాదం మొదలైంది. దీనికి ప్రతిస్పందనగా కువైట్, బహ్రెయిన్, యూఏఈలలోని అమెరికా స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయంగా ఒక్కసారిగా ఆందోళనలు పెంచింది. జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మీర్ విశ్లేషణ ప్రకారం.. ఈ వివాదం ముదిరితే ముడి చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

ఫలితంగా సురక్షిత పెట్టుబడిగా భావించే అమెరికా డాలర్, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ బలోపేతమై బంగారంపై ఒత్తిడిని పెంచుతాయన్నారు. వీటితో పాటు భారతదేశం, అమెరికా, యూరోపియన్ యూనియన్‌ల నుంచి రానున్న ద్రవ్యోల్బణ గణాంకాలు, ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల విధానాలు కూడా Gold ధరలను శాసిస్తాయి. అలాగే యూఎస్ రిటైల్ అమ్మకాలు, వారపు నిరుద్యోగ క్లెయిమ్‌లు, గృహ నిర్మాణ రంగ డేటాతో పాటు చైనా జీడీపీ వృద్ధి, బ్యాంక్ రుణాల వివరాలు పారిశ్రామిక లోహాల భవిష్యత్ గమనాన్ని నిర్దేశిస్తాయని తెలిపారు.

గత వారం దేశీయ మార్కెట్లను గమనిస్తే.. ఆగస్టు డెలివరీకి సంబంధించిన MCX Gold ఫ్యూచర్స్ ఏకంగా 3,900 రూపాయలు (2.65 శాతం) పడిపోయి.. 10 గ్రాములకు రూ. 1.43 లక్షల వద్ద ముగిసింది. అటు సెప్టెంబర్ డెలివరీకి సంబంధించిన సిల్వర్ కాంట్రాక్టులు ఏకంగా 14,746 రూపాయల (6.2 శాతం) భారీ పతనంతో కిలోగ్రాముకు రూ. 2.22 లక్షల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ కామెక్స్ మార్కెట్లో బంగారం 0.3 శాతం తగ్గి ఔన్సుకు 4,113.7 డాలర్ల వద్ద.. వెండి 1.5 శాతం తగ్గి ఔన్సుకు 60.16 డాలర్ల వద్ద ముగిశాయి.

Advertisement

ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది అభిప్రాయం ప్రకారం.. డాలర్ బలోపేతం కావడం, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంశాల వల్ల బంగారంపై అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. మార్కెట్ మధ్యమధ్యలో కోలుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. పెరిగిన ప్రతిసారీ పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపుతున్నారు. రూపాయి విలువలో స్వల్ప బలహీనత దేశీయ మార్కెట్ ధరలకు కొంత మేర మద్దతునిచ్చినప్పటికీ.. అంతర్జాతీయంగా ఉన్న బలహీన సంకేతాల వల్లే పసిడి పతనం వైపు సాగుతోంది. ప్రపంచ ఆర్థిక లేదా భౌగోళిక రాజకీయ పరిణామాలలో ఏదైనా ఒక పెద్ద సానుకూల మార్పు వచ్చేంత వరకు మార్కెట్లో ఈ ఆచితూచి వ్యవహరించే ధోరణి ఇలాగే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.