గత వారంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనై ఇన్వెస్టర్లను తీవ్ర అనిశ్చితికి గురిచేశాయి. వారం ప్రారంభంలోనే తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి ఎదురై.. ఔన్సుకు 4,000 డాలర్ల కీలక మద్దతు స్థాయి కంటే దిగువన ట్రేడ్ అయింది. అయితే తక్కువ ధరల వద్ద డిమాండ్ పెరిగి పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపడం.. అలాగే అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు క్రమంగా తగ్గడం పసిడి తిరిగి కోలుకోవడానికి కొంతవరకూ తోడ్పడింది. అయినప్పటికీ అమెరికాలో బలమైన ఉద్యోగ గణాంకాలు వెలువడటం.. అంతర్జాతీయ విపణిలో డాలర్ తన బలాన్ని నిలబెట్టుకోవడం, ద్రవ్యోల్బణ ఆందోళనలు కొనసాగుతుండటంతో బంగారం సాధించిన ఈ పురోగతి ఎక్కువ కాలం నిలబడలేకపోయింది.
వారం ప్రారంభంలో ఆదివారం సాయంత్రం ట్రేడింగ్ మొదలైన సమయంలో స్పాట్ Gold ధర ఔన్సుకు 4,015.83 డాలర్ల వద్ద స్థిరంగా కనిపించినప్పటికీ.. గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు, ఇంధన ధరలు విపరీతంగా పెరగడం.. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడం మార్కెట్‌ను తీవ్ర ఆందోళనలోకి నెట్టివేసింది.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు అధికంగానే ఉంచుతుందనే భయాలతో ఇన్వెస్టర్లు Gold అమ్మకాలకు దిగారు. ఈ అమ్మకాల ఒత్తిడి సోమవారం వరకు కొనసాగడంతో బంగారం ధర ఔన్సుకు 3,982.32 డాలర్ల వద్ద ఈ వారపు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే ఈ కనిష్ట ధరల వద్ద మళ్లీ డిమాండ్ పెరిగి కొనుగోళ్లు ప్రారంభమవ్వడంతో పతనం అక్కడతో ఆగింది.
మంగళవారం, బుధవారం నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు కొద్దిగా అనుకూలంగా మారాయి. యూఎస్ బాండ్ రాబడులు గరిష్ట స్థాయిల నుంచి పడిపోవడం, డాలర్ విలువ కొంత బలహీనపడటంతో బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. దీనికి తోడు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని మార్కెట్ పెద్దగా పరిగణనలోకి తీసుకోకుండా.. తగ్గిన చమురు ధరల వలన ద్రవ్యోల్బణ భయాలు తగ్గుముఖం పట్టడంపైనే దృష్టి సారించింది. దీనిఫలితంగా బుధవారం మధ్యాహ్నానికి స్పాట్ గోల్డ్ ధర వేగంగా పుంజుకుని.. ఈ వారంలోనే అత్యంత గరిష్ట స్థాయి అయిన ఔన్సుకు 4,165.71 డాలర్లను తాకింది.
బంగారం ధరలు పెరిగాయి.. పసిడి రేటు ఈ రోజు పెరుగుదలతో ఎందాక వెళ్లిందంటే.. జూలై 25, శనివారం ధరలు ఇవే..
అయితే, గురువారం నుంచి ఈ రికవరీకి ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. అమెరికాలో నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య అకస్మాత్తుగా 1,87,000కు పడిపోవడం మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. ఇది గత దశాబ్ద కాలంలోనే అతి తక్కువ స్థాయి కావడం విశేషం. ఈ గణాంకాలు అమెరికా కార్మిక మార్కెట్ అత్యంత పటిష్టంగా ఉందనే సంకేతాన్ని ఇచ్చాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపులో కఠిన వైఖరినే కొనసాగిస్తుందనే అంచనాలు మళ్లీ పెరిగాయి.
దీనితో డాలర్ తిరిగి బలపడి, వచ్చే వారం జరగబోయే ఫెడ్ వడ్డీ రేట్ల సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు తీవ్ర జాగ్రత్త వహించడంతో బంగారం ధర మళ్లీ 4,100 డాలర్ల దిగువకు పడిపోయింది. కేవలం పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం మాత్రమే బంగారం ధరలు మరింత పతనం కాకుండా కాపాడింది. శుక్రవారం నాటికి బంగారం ధరలు కొంత స్థిరపడినప్పటికీ.. తిరిగి 4,100 డాలర్లను అందుకోలేక చివరకు వారాంతానికి ఔన్సుకు 4,051.70 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.
ఇక రాబోయే వారం బంగారం ఏ దిశగా పయనిస్తుందనే దానిపై ప్రముఖ వారపు సర్వే ఆధారంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాల్ స్ట్రీట్ ఆర్థిక విశ్లేషకులు బంగారం స్వల్పకాలిక భవిష్యత్తుపై తీవ్ర నిరాశావాదంతో ఉన్నప్పటికీ.. సాధారణ పెట్టుబడిదారులు మాత్రం సానుకూల దృక్పథంతో ఉన్నారు. ఈ వారం నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 18 మంది నిపుణుల్లో కేవలం నలుగురు (22 శాతం) మాత్రమే వచ్చే వారం ధరలు పెరుగుతాయని భావిస్తుండగా.. ఏడుగురు (39 శాతం) ధరలు తగ్గుతాయని, మరొక ఏడుగురు (39 శాతం) మార్కెట్ ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగానే ఉంటుందని అంచనా వేశారు.
విశ్లేషకులు తగ్గుదల వైపే మొగ్గు చూపుతుంటే.. మరోవైపు చిన్న పెట్టుబడిదారులు చేసిన ఆన్‌లైన్ పోలింగ్‌లో పాల్గొన్న 249 మందిలో 147 మంది (59 శాతం) బంగారం ధరలు ఖచ్చితంగా పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 4 వేల డాలర్ల కీలక మద్దతు స్థాయి నిలబడటమే వారి ఈ నమ్మకానికి ప్రధాన కారణం కాగా.. రాబోయే వారం వెలువడే ఆర్థిక డేటానే బంగారం భవిష్యత్తును నిర్ణయించనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- బంగారం ధరలు పెరిగాయి.. పసిడి రేటు ఈ రోజు పెరుగుదలతో ఎందాక వెళ్లిందంటే.. జూలై 25, శనివారం ధరలు ఇవే..
- బంగారం ధరలు రూ. లక్షకు పడిపోతాయా.. కొనుగోలుకు అదే సరైన సమయమా.. నిపుణులు ఏమంటున్నారంటే..
- బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్లో పెట్టుబడికి ఏది బెస్ట్.. ఏది ఎక్కువ లాభాలు ఇచ్చే అవకాశం ఉంది..
- Robert Kiyosaki: బంగారం, వెండి కాదు.. భవిష్యత్తు అంతా ఆ లోహానిదే.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..
- Gold Price Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఇప్పుడే కొనేయండి..!
- బంగారం ధరలు దీపావళికి పెరుగుతాయా..తగ్గుతాయా.. ఈ లోపే కొనేయడం మంచిదా.. నిపుణులు ఏమంటున్నారంటే..