గత కొన్ని రోజులుగా నిరంతరం క్షీణిస్తూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఈ రోజు కోలుకుని పెట్టుబడిదారులకు కొంత ఊరటనిచ్చాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఆగస్టు డెలివరీ బంగారం ధర 10 గ్రాములకు రూ. 770పెరిగి రూ. 1,47,280 వద్ద స్థిరపడగా.. వెండి ధర కిలోగ్రాముకు రూ.245 పుంజుకుని రూ. 2,45,000 వద్ద ముగిసింది. గురువాం ఈ స్వల్ప రికవరీ ఊరటనిచ్చినప్పటికీ.. గత నెల రోజుల్లో బంగారం ధరలు దాదాపు 8 శాతం మేర తగ్గడంతో మార్కెట్ వర్గాలు మరింత బలమైన పునరుద్ధరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Advertisement

ఈ ధరల అస్థిరతకు ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ ల మధ్య శాంతి ఒప్పందం పూర్తిగా కుప్పకూలడం వంటి అంశాలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. అదే సమయంలో యూఎస్ డాలర్ ఇండెక్స్ 100.50 స్థాయికి బలపడటంతో విదేశీ కొనుగోలుదారులకు బంగారం మరింత ఖరీదైనదిగా మారింది. అంతర్జాతీయంగా డిమాండ్‌పై ఒత్తిడి పెరిగింది. ఊహించిన దానికంటే బలహీనంగా ఉన్న అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు లోహాలకు కొంత ఊతమిచ్చినప్పటికీ.. తీవ్రమవుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపును వాయిదా వేస్తుందనే ఆందోళనలు మార్కెట్ నెగెటివ్ సెంటిమెంట్‌ను శాసించాయి.

Advertisement

భవిష్యత్తు ధరల కదలికలపై మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తూ.. బంగారం ధరలు ఇకపై భారీగా పడిపోయే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత స్థాయిలలో ధరలు చాలా వరకు స్థిరపడ్డాయని.. ఒకవేళ తగ్గినా అది గరిష్టంగా మరో 5 శాతం పరిధిలోనే ఉండవచ్చని స్పష్టం చేస్తున్నారు. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారానికి రూ. 1. 40 లక్షల వద్ద అత్యంత బలమైన మద్దతు లభిస్తోంది. అందువల్ల ఆభరణాల కొనుగోలుదారులు మరింత Gold ధరలు తగ్గుతాయని వేచి చూడకుండా.. ఈ ప్రస్తుత తగ్గుదలనే మంచి కొనుగోలు అవకాశంగా మలుచుకోవచ్చని సూచిస్తున్నారు.

Advertisement
బంగారం, వెండి ధరల పెరుగుదల తాత్కాలికమే.. భారీ పతనం ముందు ముందు తప్పదంటున్న ప్రముఖ స్విస్ బ్యాంకులు..

ముందున్న పండుగల సీజన్, దీపావళి నాటికి బంగారం ధరల సరళిని పరిశీలిస్తే.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గి పరిస్థితులు సద్దుమణిగితే దేశీయ మార్కెట్లో 10 గ్రాముల Gold ధర సుమారు రూ. 1.60 లక్షల స్థాయికి చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఒకవేళ అంతర్జాతీయంగా అనిశ్చిత వాతావరణం ఇలాగే కొనసాగితే మాత్రం ధరలు 10 గ్రాములకు రూ. 1.40 లక్షల నుంచి రూ. 1. 50 లక్షల పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

ఆభరణాలు లేదా గృహ అవసరాల కోసం బంగారం కొనుగోలు చేసేవారు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరల ఊగిసలాటను దృష్టిలో ఉంచుకుని.. తమ వద్ద ఉన్న బడ్జెట్‌ మొత్తాన్ని ఒకేసారి వెచ్చించకుండా విడతల వారీగా కొనుగోలు చేయడం ఉత్తమమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ధరల్లో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల కలిగే నష్ట భయం తగ్గుతుంది. అలాగే బంగారం కొనేటప్పుడు ప్రతి ఆభరణంపై బిఐఎస్ 916 హాల్‌మార్క్, ఆరెంకెల ప్రత్యేక హెచ్‌యుఐడి (HUID) కోడ్ ఉందో లేదో ఖచ్చితంగా సరిచూసుకోవాలి.

వివిధ జ్యువెలరీ దుకాణాల్లో తరుగు, తయారీ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి.. కొనుగోలు చేసే ముందే రెండు మూడు నమ్మకమైన షాపుల్లో రేట్లను పోల్చి చూసుకోవడం ద్వారా అదనపు ఖర్చులను ఆదా చేసుకోవచ్చు. ఏ రకమైన కొనుగోలు చేసినా బంగారం బరువు, స్వచ్ఛత, మూడు శాతం జీఎస్టీ వివరాలు స్పష్టంగా ఉన్న పక్కా బిల్లును తప్పనిసరిగా తీసుకోవడం భవిష్యత్తు మార్పిడులకు లేదా అమ్మకాలకు ఎంతో ఉపయోగపడుతుంది.

Advertisement

మరోవైపు కేవలం పెట్టుబడి కోణంలో బంగారం కొనాలనుకునేవారు భౌతిక రూపంలో ఉండే ఆభరణాలు లేదా నాణేల కంటే గోల్డ్ ఈటీఎఫ్‌లు (Gold ETFs), డిజిటల్ గోల్డ్ లేదా Sovereign Gold Bonds వంటి సాధానాలను ఎంచుకోవడం శ్రేయస్కరమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వీటిలో తయారీ ఛార్జీలు, లాకర్ రుసుములు ఉండకపోవడమే కాకుండా దొంగతనం భయం కూడా ఉండదు. సాధారణంగా మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో బంగారానికి ఐదు నుండి పది శాతానికి మించి కేటాయించకూడదు.

ఎందుకంటే సంక్షోభ సమయాల్లో ఇది మీ పెట్టుబడికి రక్షణగా మాత్రమే పనిచేస్తుంది. ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారానికి రూ. 1.40 లక్షల వద్ద బలమైన మద్దతు లభిస్తోంది కాబట్టి.. ధరలు ఆ స్థాయికి సమీపిస్తున్న సమయంలో కొనుగోలు చేయడం మంచి వ్యూహం అవుతుంది. రాబోయే పండుగల సీజన్, దీపావళి నాటికి ధరలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్నందున, ఆభరణాల అవసరం ఉన్నవారు ధరలు మరింత తగ్గుతాయని ఆశించకుండా ముందస్తు ప్రణాళికతో కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.