విదేశీ ఉద్యోగాల పేరుతో వందలాది మంది నిరుద్యోగులను నమ్మించి.. రూ. 13 కోట్లకు పైగా ముంచిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక జంట నకిలీ విదేశీ నియామక కన్సల్టెన్సీని నిర్వహిస్తూ.. పలు యూరోపియన్ దేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని నమ్మబలికి వందలాది మంది ఉద్యోగార్థుల నుంచి ఏకంగా రూ. 13 కోట్లకు పైగా వసూలు చేసి మోసగించిన ఆరోపణలపై అరెస్టయ్యారు.

Advertisement

విజయవాడ సమీపంలోని పైదురుపాడు గ్రామానికి చెందిన ముసునూరి శ్రీనివాస్, సౌజన్య అనే దంపతులు ఫ్లయింగ్ బోర్డర్స్ పేరుతో కన్సల్టెన్సీ సంస్థలను ఏర్పాటు చేశారు. వీరు నెదర్లాండ్స్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, ఫిన్లాండ్ వంటి విదేశాలలో వివిధ హోదాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రకటనలు ఇస్తూ నిరుద్యోగ యువతను బురిడీ కొట్టించారు.

Advertisement

ఈ దంపతులు ఆఫర్ చేసే ఉద్యోగాల కేటగిరీని బట్టి ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 8 లక్షల నుండి రూ. 13 లక్షల వరకు దండుకున్నట్లు పోలీసులు తెలిపారు. తమ నియామక ప్రక్రియ నిజమైనదిగా ప్రతిబింబించేలా చేయడానికి తమ సొంత ముఠా సభ్యులతోనే విదేశీ కంపెనీల ప్రతినిధులుగా నటింపజేసి.. నకిలీ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలను కూడా నిర్వహించారు. ఇంటర్వ్యూల అనంతరం అభ్యర్థులకు సెలక్షన్ తృటిలో తప్పిందని లేదా అదనపు ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉందంటూ మరింత డబ్బు గుంజడం కొనసాగించారు. ఎవరైనా ప్రాసెస్ గురించి ప్రశ్నించినా లేదా చెల్లించిన డబ్బులు వాపసు ఇవ్వాలని కోరినా.. వారి దరఖాస్తులను రద్దు చేయడంతో పాటు వారి ఫోన్ నంబర్లను బ్లాక్ చేసేవారు.

Advertisement
ప్రభుత్వానికి కోటి రూపాయలు పన్ను చెల్లించా.. ఉద్యోగం పోయిన తర్వాత నా బతుకు ఎలా ఉందంటే..

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం విజయవాడలో దాదాపు 700 మంది బాధితుల నుంచి రూ. 11 కోట్లు, విశాఖపట్నంలో సుమారు 130 మంది నుంచి మరో రూ. 2.2 కోట్లు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ నెట్‌వర్క్ హైదరాబాద్‌లోని కార్యాలయం వరకు విస్తరించి ఉండటంతో అక్కడ కూడా మరికొంతమంది బాధితులు ఉండే అవకాశం ఉందని.. విచారణ ముమ్మరమయ్యే కొద్దీ మోసపోయిన బాధితుల సంఖ్య ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

Advertisement

మాచవరం, అజిత్‌సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగి ఈ దంపతులను అరెస్టు చేసింది. నిందితులు బాధితుల నుంచి వసూలు చేసిన అక్రమ సొమ్ముతో రూ. 2.25 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ. 71.45 లక్షల విలువైన బంగారం, పలు విలాసవంతమైన వాహనాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ జంటపై ఎనిమిది తీవ్రమైన మోసపూరిత కేసులు నమోదై ఉన్నాయని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు.