కిరాణా విభాగంలో దూసుకుపోతున్న డిమార్ట్ ఇప్పుడు సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. రాధాకిషన్ దమానీ నేతృత్వంలోని అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డీమార్ట్) కిరాణా, నిత్యావసరాల విభాగంలో సాధించిన అపూర్వ విజయంతో ఇప్పుడు భారత రిటైల్ ఫార్మసీ రంగంలోకి అడుగుపెట్టింది. నిత్యావసర ఉత్పత్తుల విక్రయంలో డీమార్ట్ అనుసరిస్తున్న విశ్వసనీయమైన ఎవ్రీడే లో ప్రైసింగ్ (EDLP) వ్యూహాన్నే ఫార్మసీ విభాగానికి కూడా వర్తింపజేస్తూ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) పరిధిలో ఔషధాలపై ఫ్లాట్ 20 శాతం డిస్కౌంట్ ఆఫర్‌తో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దేశీయ ఫార్మసీ రంగంలో ముఖ్యంగా సాంప్రదాయ మెడికల్ షాపులు, డిజిటల్ ఈ-ఫార్మసీ ప్లాట్‌ఫామ్‌ల వ్యాపార నమూనాలను డిమార్ట్ తీవ్రంగా ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
డీమార్ట్ ఈ ఫార్మసీ వ్యాపారాన్ని తన పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ అయిన రిఫ్లెక్ట్ హెల్త్‌కేర్ అండ్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ (RHRPL) ద్వారా హితేష్ షా సారథ్యంలో నడిపిస్తోంది. ఆర్థిక సంవత్సరం 2025లో ఈ సంస్థ సాధించిన వివరాలు పరిశీలిస్తే.. మునుపటి ఏడాదితో పోలిస్తే దాదాపు నాలుగు రెట్ల వృద్ధి నమోదు చేస్తూ ఆర్‌హెచ్‌ఆర్‌పిఎల్ రాబడి రూ. 12.92 కోట్లకు చేరింది. ఆరంభ విభాగాన్ని విస్తరించే క్రమంలో అయిన ప్రాథమిక పెట్టుబడుల వల్ల కంపెనీ నష్టాలు రూ. 0.69 కోట్ల నుండి రూ. 2.45 కోట్లకు పెరిగినప్పటికీ.. స్థిరమైన వృద్ధి వైపు ఇది సానుకూల ధోరణినే సూచిస్తోందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
ఈ విస్తరణలో డీమార్ట్ ఎంచుకున్న అత్యంత కీలకమైన వ్యాపార శైలి ఏమిటంటే.. అధిక అద్దెలు లేదా కొనుగోలు వ్యయాలతో ప్రత్యేకంగా కొత్త స్టోర్లను నిర్మించకపోవడమే. కంపెనీకి ఉన్న 503 భౌతిక హైపర్‌మార్కెట్‌లలోనే ప్రత్యేక ఫార్మసీ కౌంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా అదనపు రియల్ ఎస్టేట్ భారాన్ని తగ్గించుకుంటోంది. ఈ విధమైన 'స్టోర్-ఇన్-స్టోర్ పద్ధతి ద్వారా సాంప్రదాయ మెడికల్ షాపులు, ఆన్‌లైన్ ఫార్మసీలు ఎదుర్కొనే అతిపెద్ద సవాళ్లైన కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ (CAC), అద్దెల ఖర్చులను డీమార్ట్ అధిగమిస్తోంది. ప్రతిరోజూ లక్షలాది మంది వినియోగదారులు డీమార్ట్ స్టోర్లకు రావడం వల్ల, ఎలాంటి ఉచిత ప్రకటనలు లేదా ఆఫర్ మార్కెటింగ్ లేకుండానే నిరంతర కస్టమర్ రద్దీ కౌంటర్లకు లభిస్తోంది.
స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీ.. సెన్సెక్స్ 888 పాయింట్లు, నిఫ్టీ 264 పాయింట్లు జంప్..
మరోవైపు వ్యాపార లాభదాయకత కోణంలో ఫార్మసీ విభాగం అత్యంత కీలకమైనది. బ్రాండెడ్ జెనెరిక్ ఔషధాలపై స్థూల లాభాల మార్జిన్లు 25 నుండి 30 శాతం వరకు ఉంటాయి, ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తుల్లో ఇవి ఇంకా ఎక్కువగా నమోదవుతాయి. సొంత రియల్ ఎస్టేట్ సౌకర్యం, స్థిరమైన నిర్వహణ ఖర్చులు ఉండడం వల్ల డీమార్ట్ వినియోగదారులకు 20 శాతం డిస్కౌంట్ అందించినా, తన యూనిట్-ఎకనామిక్స్ పరంగా సానుకూల లాభాలను సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని ప్రభావం స్థానిక మెడికల్ దుకాణాల లాభాలపై గణనీయంగా పడే అవకాశం ఉంది. అదే సమయంలో ఉచిత డెలివరీలు, భారీ డిస్కౌంట్లతో ఇప్పటికే అధిక నగదు నష్టాలను అనుభవిస్తున్న ఈ-ఫార్మసీల ఉనికిపై కూడా ఇది తీవ్ర ఒత్తిడిని తీసుకరానుంది.
ముంబైలో ఆరంభ దశలో వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన ప్రోత్సాహకరంగా ఉండటంతో.. డీమార్ట్ ఈ ఫార్మసీ నెట్‌వర్క్‌ను క్రమంగా ఇతర నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది. సంక్లిష్టమైన ఇన్వెంటరీ సవాలును డీమార్ట్ ఏ విధంగా సమర్థవంతంగా నిర్వహిస్తుందనే దానిపైనే దీని పూర్తి విజయం ఆధారపడి ఉంది. అయినప్పటికీ, తనకున్న విపరీతమైన కస్టమర్ బేస్, వ్యయ నియంత్రణ నైపుణ్యంతో డీమార్ట్ ఫార్మసీ విభాగాన్ని విస్తరిస్తే, ఇది భారత హెల్త్‌కేర్ రిటైల్ రంగాన్ని మరో ఎత్తుకు తీసుకువెళ్లే అవకాశాలు దండిగా ఉన్నాయి.
More Articles
- డీమార్ట్ క్యూ4 ఫలితాలు: లాభాల జోరులో ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చే ట్విస్ట్ ఇదేనా?
- D-Mart News: డీమార్ట్ కుప్పకూలుతోందా? 20 ఏళ్ల తర్వాత గందరగోళం, దమానీకి తలనొప్పి..
- DMart Stock: డీమార్ట్ స్టాక్ ఢమాల్.. ఇంట్రాడేలో 9% పతనం ఎందుకంటే.. బ్రోకరేజ్ సూచన ఇదే..
- DMart: అదరగొట్టిన డీమార్ట్ లాభాలు.. క్యూ2లో రాధాకిషన్ దమానీ గెయిన్ రూ.660 కోట్లు
- DMart News: దమానీ షాపింగ్.. ముంబైలో 1.2 ఎకరాల ల్యాండ్ కొనుగోలు, రేటెంతంటే..
- ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..