రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఇకపై టికెట్ బుకింగ్‌ను మరింత వేగంగా, సులభంగా మార్చేందుకు త్వరలో కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. కొత్త పోర్టల్‌లో మెరుగైన యూజర్ ఇంటర్‌ఫేస్, వేగవంతమైన బుకింగ్ ప్రక్రియ, అధిక ట్రాఫిక్‌ను సులభంగా నిర్వహించే సామర్థ్యం వంటి ఫీచర్లు ఉండనున్నాయి. దీంతో ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో ప్రయాణికులకు మెరుగైన అనుభవం లభించే అవకాశముందని ఐఆర్సీటీసీ తెలిపింది.

Advertisement

ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు, ముఖ్యంగా తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు పేజీలు, అనంతమైన క్యాప్చాలు, తప్పుడు సమయంలో వచ్చే పాప్-అప్‌లతో నెమ్మదిగా లోడ్ అవుతుంటాయి. ఈ ఆలస్యంతో విసిగిపోయిన ప్రయాణికులకు ఇది ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించి, బుకింగ్ ప్రక్రియను మరింత వేగంగా, సరళంగా మార్చడానికి వీలుగా పూర్తిగా ఆధునీకరించిన కొత్త IRCTC వెబ్‌సైట్ బీటా వెర్షన్‌ను రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.

Advertisement

ఈ కొత్త పోర్టల్ ప్రజలు టిక్కెట్లు బుక్ చేసుకునే విధానాన్ని మార్చకుండా.. ప్రస్తుతం ఉన్న ప్రక్రియను మరింత సులభతరం చేయడంపైనే దృష్టి పెట్టింది. దీనిని దేశవ్యాప్తంగా రైల్వే రిజర్వేషన్లను నిర్వహించే సాంకేతికత అయిన ఇండియన్ రైల్వేస్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)తో అనుసంధానిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రయాణికులు అత్యంత వేగవంతమైన, అవాంతరాలు లేని బుకింగ్ అనుభవాన్ని పొందవచ్చు. అధికారికంగా ప్రారంభించడానికి ముందు.. ఈ వెబ్‌సైట్ బీటా వెర్షన్‌ను జైపూర్‌లోని మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNIT) విద్యార్థులకు ప్రదర్శించి, పోర్టల్‌ను మరింత మెరుగుపరచడం కోసం IRCTC, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) అధికారులు వారి నుండి విలువైన అభిప్రాయాలను కూడా సేకరించారు.

Advertisement

ఈ కొత్త IRCTC వెబ్‌సైట్‌లో రాబోతున్న ప్రధాన మార్పులను గమనిస్తే.. వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన ఇంటర్‌ఫేస్‌ను రూపొందించారు. ఇందులో బుకింగ్ సమయాన్ని వృధా చేసే అనవసరమైన పాప్-అప్‌లను, దృష్టిని మరల్చే జిగేల్ గ్రాఫిక్‌లను పూర్తిగా తొలగించారు. అలాగే ప్రతి సెకనూ ఎంతో విలువైన తత్కాల్ బుకింగ్స్ సమయంలో పెద్ద అడ్డంకిగా మారే అనవసరమైన క్యాప్చాలను కూడా నివారించారు. ప్రయాణికులు స్లీపర్, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్ వంటి వివిధ తరగతులను విడివిడిగా తనిఖీ చేసుకునే శ్రమ లేకుండా.. అందుబాటులో ఉన్న అన్ని తరగతుల సీట్ల లభ్యతను ఈ కొత్త వెబ్‌సైట్ ఒకే స్క్రీన్‌పై ప్రదర్శిస్తుంది. దీనివల్ల వివిధ ఎంపికలను తక్కువ సమయంలో పోల్చి చూసుకోవచ్చు.

Advertisement

ప్రస్తుతం టిక్కెట్ బుక్ చేసుకుని పేమెంట్ పేజీకి వెళ్లడానికి ముందు ఎన్నో స్క్రీన్‌లను దాటాల్సి వస్తుండగా.. కొత్త వెబ్‌సైట్‌లో బుకింగ్ పూర్తి చేయడానికి అవసరమైన క్లిక్‌ల సంఖ్యను రైల్వే శాఖ భారీగా తగ్గించింది. వీటితో పాటు తరచుగా ప్రయాణించే వారు ప్రతిసారీ ప్రయాణికుల పేర్లు, వయస్సు వంటి వివరాలను మళ్లీ మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా, వివరాలను ముందే సేవ్ చేసుకునే వీలు కల్పించారు.

జైపూర్‌లోని MNIT సందర్శనలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించినట్లుగా.. ఈ ఆధునికీకరించిన IRCTC వెబ్‌సైట్ జూలైలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం బీటా వెర్షన్ సిద్ధంగా ఉన్నప్పటికీ, అప్‌గ్రేడ్ చేసిన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌తో దీనిని పూర్తిగా అనుసంధానించి.. రాబోయే కొద్ది నెలల్లో పూర్తిస్థాయి వెబ్‌సైట్‌ను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి భారతీయ రైల్వే వేగంగా అడుగులు వేస్తోంది.