భారతదేశంలో ఆన్‌లైన్ Food Delivery రంగంలో తీవ్ర ఒత్తిడులు బయటపడుతున్నాయి. దేశపు ప్రధాన టెక్ హబ్, భారత సిలికాన్ సిటీ బెంగళూరులో ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ 'స్విగ్గీ' (Swiggy)తో పాటు ఇతర ప్లాట్‌ఫామ్‌ల వైఖరిపై రెస్టారెంట్ యజమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
తమ ఆర్థిక మనుగడనే ప్రశ్నించే విధంగా మారుతున్న అశాస్త్రీయ కోతలు, అధిక కమీషన్లు, దాగి ఉన్న ఛార్జీలను నిరసిస్తూ బెంగళూరు రెస్టారెంట్ యజమానుల సంఘం ఆగస్టు 15 నుండి స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ను పూర్తిగా బహిష్కరిస్తామని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ప్లాట్‌ఫామ్‌ల నుండి వైదొలగడంతో పాటు నగరవ్యాప్తంగా రెస్టారెంట్ల బంద్‌కు దిగుతామని ప్రకటించడం ఈ రంగంలో పెద్ద కలకలాన్నే రేపింది.
ఈ వివాదం వెనుక ఉన్న ప్రధాన ఆర్థిక నష్టాలను బెంగళూరు హోటల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పి.సి. రావు స్పష్టంగా వివరించారు. స్విగ్గీ అవలంబిస్తున్న వ్యాపార విధానాల వల్ల ఆహార తయారీదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు.
సాధారణంగా ఒక రెస్టారెంట్ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ. 1 లక్ష విలువైన వ్యాపారాన్ని సాగిస్తే.. ప్లాట్‌ఫామ్ మినహాయించే భారీ కమీషన్లు, యాజమాన్యాల అనుమతి లేకుండా ఇచ్చే బలవంతపు డిస్కౌంట్లు, ప్రకటనల ఫీజులు, ఇతర దాగి ఉన్న సేవా రుసుములు పోను చివరకు యజమానుల చేతికి కేవలం రూ. 40 వేలు మాత్రమే మిగులుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదాయంలో సగానికి పైగా ప్లాట్‌ఫామే కైవసం చేసుకోవడంతో వ్యాపార నిర్వహణ అత్యంత భారంగా మారిందని పేర్కొన్నారు. ఈ నిరసనకు బెంగళూరు హోటల్ అసోసియేషన్‌తో పాటు కర్ణాటక హోటల్ అసోసియేషన్, నేషనల్ రెస్టారెంట్ & బార్ అసోసియేషన్‌లు ఏకమై సమిష్టి పోరాటానికి సిద్ధమయ్యాయి.
రెస్టారెంట్ యజమానులు స్విగ్గీ ముందు అనేక కీలకమైన పారదర్శక డిమాండ్లను ఉంచారు. వినియోగదారులు ఆహారం పై ఫిర్యాదు చేసిన వెంటనే రెస్టారెంట్లకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా ఆటోమేటిక్‌గా సొమ్మును రద్దు చేసే విధానానికి స్వస్తి పలకాలని వారు కోరుతున్నారు. అలాగే ఆహారం సిద్ధం చేసిన తర్వాత కస్టమర్ ఆర్డర్‌ను రద్దు చేస్తే.. ఆ ఆర్థిక నష్టాన్ని రెస్టారెంట్లపై మోపకుండా ప్లాట్‌ఫామే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తలరాత ఇప్పుడైనా మారుతుందా.. నూతన సీఈఓగా నందితా సిన్హా.. ఎవరీ ఈ డైనమిక్ లేడీ..
ప్లాట్‌ఫామ్ ఇచ్చే అన్ని రకాల తగ్గింపులకు సంబంధించి పారదర్శకమైన సెటిల్‌మెంట్ నివేదికలను అందించాలని.. రెస్టారెంట్ భాగస్వాముల అనుమతి లేకుండా ఏకపక్షంగా నిబంధనలు మార్చకూడదని డిమాండ్ చేస్తున్నారు. రెస్టారెంట్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజర్‌ను కేటాయించడంతో పాటు అడ్వర్టైజింగ్, పేమెంట్ గేట్‌వే ఛార్జీలను స్పష్టంగా వెల్లడించాలని ఆశిస్తున్నారు.
సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి స్విగ్గీ యాజమాన్యం వెంటనే ముందుకు రావాలని.. ఆగస్టు 15 లోగా సరైన పరిరిష్కారం చూపకపోతే కేవలం స్విగ్గీ మాత్రమే కాకుండా జొమాటో (Zomato) నుండి కూడా నిష్క్రమిస్తామని హెచ్చరించారు. అశాస్త్రీయ కోతలను నిలిపివేసి పారదర్శకమైన, న్యాయమైన వ్యాపార వాతావరణాన్ని కల్పిస్తే ప్లాట్‌ఫామ్‌లతో కలసి పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు నొక్కి చెప్పారు. త్వరితగతిన వాణిజ్యం, ఫుడ్ డెలివరీ రంగాలు విపరీతమైన వృద్ధి సాధిస్తున్న తరుణంలో.. ప్లాట్‌ఫామ్‌లు, వ్యాపార భాగస్వాముల మధ్య తలెత్తిన ఈ ఆర్థిక వైరుధ్యాలు ఆన్‌లైన్ ఆహార పంపిణీ రంగానికి కొత్త సవాలుగా మారాయి.
More Articles
- Flipkart In Food Delivery: ఫుడ్ డెలివరీ బిజినెస్‌లోకి ఫ్లిప్ కార్ట్.. స్విగ్గీ, జొమాటోకు దబిడ దిబిడే..!
- బెంగళూరులో స్విగ్గీ కొత్త సంచలనం: హెల్త్ ఫ్రీక్స్ కోసం 'ఈట్‌రైట్' స్పెషల్ మెనూ!
- Petrol Prices: పెట్రోల్ ధరల సెగ! ఇకపై ఫుడ్ డెలివరీ ఛార్జీలు కూడా పెరగనున్నాయా?
- స్విగ్గీ నుంచి కొత్తగా టోయింగ్ యాప్, చౌకైన ధరలో భోజనం కోరుకునే వారికి మాత్రమే..
- Swiggy UPI: జొమాటోకి స్విగ్గీ షాక్.. ఆర్డర్ స్పీడు పెంచేందుకు యూపీఐ సర్వీస్ లాంఛ్..
- Uber News: టాప్ గేర్‌లో ఉబెర్ రైడ్ షేరింగ్ బిజినెస్.. అంచనాలను తలక్రిందులు చేస్తూ..