ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ టెక్నాలజీలు మనుషుల ఉద్యోగాలకే ప్రమాదం అనుకుంటే పొరపాటే. ఇప్పుడు ఏకంగా టెక్ కంపెనీలకే అవి ఎసరు పెడుతున్నాయి.

Advertisement

చిన్న ఐటీ కంపెనీల నుంచి పెద్ద టెక్ దిగ్గజాల వరకు అన్నీ ఇప్పుడు AI వాడకాన్ని రోజురోజుకు పెంచుతున్నాయి. ఈ ప్రభావం భారత సంప్రదాయ ఐటీ సేవల రంగంపై తీవ్రంగా పడుతోంది. తాజాగా, AI కారణంగానే దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ HCL టెక్.. గూగుల్ నుంచి రావాల్సిన ఓ కీలక కాంట్రాక్టులో ఏకంగా 50 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది.

Advertisement

గూగుల్, HCL టెక్ మధ్య గత 10 ఏళ్లుగా ఐటీ సేవలు, ఇంజనీరింగ్ ఒప్పందం కొనసాగుతోంది. దీని వార్షిక విలువ సుమారు 200 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1,600 కోట్లకు పైమాటే.

అయితే, ఈ ఏడాది కాంట్రాక్టులో నాలుగో వంతు, అంటే 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 477 కోట్లు) విలువైన పనులను గూగుల్ ఉన్నట్టుండి రద్దు చేసింది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇంజనీరింగ్ పనుల కోసం గూగుల్ ఇప్పుడు ఎక్కువగా AI ఆధారిత ఆటోమేషన్ టూల్స్‌ను వాడుతుండటమే ఈ కోతకు ప్రధాన కారణం.

Advertisement

ఈ దెబ్బతో ఈ ఒక్క ఏడాదే HCL టెక్ ఆదాయంలో 50 మిలియన్ డాలర్ల మేర గండి పడింది. ఈ నష్టంతో HCL టెక్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల ఉద్యోగాలు ఊడిపోతాయేమోనన్న భయం మొదలైంది. అయితే, ఉద్యోగుల తొలగింపు వంటివి ఉండవని తెలుస్తోంది.

గూగుల్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులను HCL టెక్‌లోని ఇతర ప్రాజెక్టులకు బదిలీ చేస్తారని సమాచారం. ప్రస్తుతం HCL టెక్ మొత్తం వార్షిక ఆదాయం సుమారు 14.7 బిలియన్ డాలర్లు. ఇందులో ఈ 50 మిలియన్ డాలర్ల కోత కేవలం 0.3% మాత్రమే. కాబట్టి, కంపెనీ మొత్తం ఆదాయంపై దీని ప్రభావం చాలా తక్కువే.

Advertisement

కానీ, ఈ మార్పు ఐటీ కంపెనీలపై క్రమంగా పెను ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే, పెద్ద కంపెనీలకు వచ్చే ఆదాయం నెమ్మదిగా తగ్గుతుంది. దీంతో ఖర్చులను తగ్గించుకోవడానికి, పనులను సులభతరం చేయడానికి కంపెనీలు పునర్‌వ్యవస్థీకరణకు దిగొచ్చు. ఆ సమయంలో, ఆధునిక టెక్నాలజీలకు అనుగుణంగా అప్‌డేట్ అయిన ఉద్యోగులను మాత్రమే ఐటీ కంపెనీలు అట్టిపెట్టుకుంటాయి.

కోడింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, మెయింటెనెన్స్ వంటి పనులను ఇప్పుడు AI టెక్నాలజీలే చేసేస్తున్నాయి. దీంతో, గతంలో మాదిరిగా వందలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లపై ఆధారపడాల్సిన అవసరం కంపెనీలకు ఉండదు. ఫలితంగా, కంపెనీలు ఉద్యోగులను నియమించుకునే పద్ధతే పూర్తిగా మారిపోనుంది.

Advertisement

ఐటీ రంగంలో ఇలాంటి ఒత్తిడి ఒక్క HCLకే కాదు, ఇతర కంపెనీలకూ మొదలైంది. విప్రోకు మెటా (ఫేస్‌బుక్) నుంచి వస్తున్న కాంట్రాక్టు విలువలో కూడా 25% వరకు కోత పడినట్లు సమాచారం. AI రాకాసి పెరుగుదలతో, రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీలు పనిచేసే విధానమే సమూలంగా మారబోతోంది. కాబట్టి, ఐటీ ఉద్యోగాల్లో ఉన్నవారు, ఆ రంగంలోకి రావాలనుకునేవారు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండటం తప్పనిసరి.