భవిష్యత్ అంతా ఏఐదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు ఏదైనా ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకుని, అందులో నిపుణుడిగా ఉంటే చాలు, మంచి ఉద్యోగం దొరికేది.
కానీ, ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు చాలా మంది కేవలం కోడింగ్ రాయడమే కాకుండా, ఫుల్-స్టాక్ డెవలపర్లుగా, ఆల్-రౌండర్లుగా మారుతున్నారు. అయితే, ఇప్పుడు ఇది కూడా సరిపోవడం లేదనేదే అసలు సమస్య.
ప్రస్తుతం భారత ఐటీ కంపెనీలు కేవలం ఏఐ నిపుణులను మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. దానికి బదులుగా, కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని, వారి సమస్యలను పరిష్కరించగల ఏఐ ఇంజనీర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.
గతంలో 'ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజనీర్లు', 'ఏజెంటక్ ఏఐ ఇంజనీర్ల'కు కేవలం అమెరికన్ టెక్ కంపెనీలలో మాత్రమే డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు తొలిసారిగా ఇండియాలో కూడా వీరికి డిమాండ్ భారీగా పెరిగింది.
ఇటీవల CIEL HR సంస్థ 9 రంగాల్లోని సుమారు 200 కంపెనీలపై జరిపిన సర్వేలో ఒక ఆసక్తికర విషయం వెల్లడైంది. చాలా కంపెనీలు ఇప్పుడు నేరుగా కస్టమర్లతో మాట్లాడే ఇంజనీర్లను, స్కిల్ డెవలప్‌మెంట్ విభాగాల్లోని ఉద్యోగులను ఎక్కువగా నియమించుకుంటున్నాయని ఈ సర్వే తేల్చింది.
RPG గ్రూప్, వోల్వో, EY, సావిల్స్ ఇండియా వంటి అనేక కంపెనీలు ఈ మార్పును ధృవీకరించాయి. దీనిపై CIEL HR సంస్థ ప్రెసిడెంట్ ఆదిత్య మాట్లాడుతూ, "ఏఐ టెక్నాలజీని లాభదాయకంగా ఎలా ఉపయోగించవచ్చో తెలిసిన ఉద్యోగులనే కంపెనీలు ఇప్పుడు ఎక్కువగా కోరుకుంటున్నాయి" అని తెలిపారు.
వీరి ద్వారా కస్టమర్లు ఎదుర్కొనే సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చని, సాఫ్ట్‌వేర్ సర్వీస్ డెలివరీని, పని విధానాలను మెరుగుపరచవచ్చని ఆయన అన్నారు. తద్వారా కంపెనీకి, వ్యాపారానికి అదనపు విలువను సృష్టించవచ్చని ఆయన వివరించారు.
గత ఏడాది కాలంలో భారత కంపెనీలలో 'ఏజెంటక్ ఏఐ ఇంజనీర్ల'కు డిమాండ్ 260 శాతం పెరిగింది. అదేవిధంగా, 'ఫార్వర్డ్-డిప్లాయ్డ్ ఇంజనీర్ల'కు డిమాండ్ 130 శాతం వరకు పెరిగింది.
అంతేకాదు, ఈ పోస్టులలో నియమితులైన వారికి భారీ జీతాలు ఇవ్వడానికి కంపెనీలు ఏమాత్రం వెనుకాడటం లేదు. ప్రస్తుతం పెద్ద కంపెనీలు ఇలాంటి ఉద్యోగాలకు రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు వార్షిక ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి.
ఏఐ ముఖ్యం అయినప్పటికీ, దానిని లాభదాయకంగా మార్చి కంపెనీకి ఎలా ఉపయోగించవచ్చో వీరికి తెలుసు కాబట్టే, వీరికి ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అయితే, ఈ రంగంలో భారీగా ఉద్యోగాలు సృష్టించబడతాయా అంటే ప్రస్తుతానికి అవకాశాలు తక్కువే. కానీ, కాలక్రమేణా ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More Articles
- చైనా AI చీప్ నమూనాలతో పెను ముప్పు..జాగ్రత్తగా లేకుంటే భారీ నష్టం తప్పదంటున్న జెఫరీస్..
- హెచ్సీఎల్ సంచలనం: ఐటీ ఉద్యోగులకు భవిష్యత్తు భద్రత!
- భారత AI రాజధానిగా విశాఖ నగరం.. బెంగళూరు, ముంబైలకి బిగ్ సవాల్.. తాజా న్యూస్ ఏంటంటే..
- ఏఐ దెబ్బకు బ్యాంక్ ఉద్యోగం కూడా గ్యారంటీ లేదు...7 700 మంది ఉద్యోగులను తొలగించిన టాప్ బ్యాంకింగ్ దిగ్గజాలు..
- AIతో ఆటోమేటిక్ UPI పేమెంట్స్.. NPCI కొత్త ప్రోటోకాల్ ఎలా పనిచేస్తుందో తెలుసా..
- తెలంగాణలో భారీ AI క్యాంపస్ ఈ ఏరియాలోనే.. సీఏం రేవంత్ రెడ్డిని కలిసిన ఎయిర్టెల్ చీఫ్..