ఏఐ చిప్‌మేకర్ ఎన్విడియాను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ తిరిగి స్థానం దక్కించుకుంది. కంపెనీ షేర్లు ఒక్క ట్రేడింగ్‌ సెషన్‌లో ఏకంగా 15.5 శాతం పెరగడంతో మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ విలువ దాదాపు 450 బిలియన్‌ డాలర్లు పెరిగింది. భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే దాదాపు రూ.42 లక్షల కోట్లు. అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒకే రోజులో ఏ లిస్టెడ్‌ కంపెనీ సాధించని స్థాయిలో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పెరగడం ఇదే తొలిసారని చెబుతున్నారు. గత సంవత్సరం ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రపంచదేశాలపై విధించిన టారిఫ్‌లను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సందర్భంలో ఎన్విడియా షేర్లు భారీగా పెరిగాయి. దీంతో ఈ చిప్‌ కంపెనీ మార్కెట్‌ విలువ ఒక ట్రేడింగ్‌ సెషన్‌లో దాదాపు 440 బిలియన్‌ డాలర్ల మేర పెరిగింది. ఎన్విడియా నెలకొల్పిన సుమారు 441 బిలియన్‌ డాలర్ల రికార్డును మైక్రోసాఫ్ట్‌ క్రాస్ చేసింది.

Advertisement

మైక్రోసాఫ్ట్ లో ఈ ర్యాలీకి ప్రధాన కారణం మైక్రోసాఫ్ట్ క్లౌడ్ వ్యాపారం. కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాలు, సేవలపై భారీగా ఖర్చు చేస్తుండడం కూడా కంపెనీకి కలిసొచ్చాయి. అంతే కాకుండా త్రైమాసిక ఫలితాలు కూడా బాగానే వచ్చాయి. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 18 శాతం పెరిగి 90 బిలియన్‌ డాలర్లకు చేరింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్ అయిన అజూర్, ఊహించిన దానికంటే బలమైన వృద్ధిని నమోదు చేసింది. అజూర్‌ క్లౌడ్‌ సేవల ఆదాయం నాలుగో త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 43 శాతం పెరిగింది. ఇది మార్కెట్‌ అంచనాలను అధిగమించింది.

Advertisement

వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అజూర్‌ వృద్ధి దాదాపు 45 శాతంగా ఉండొచ్చని కంపెనీ గైడెన్స్ లో పేర్కొంది. దీంతో కృత్రిమ మేధ (AI) సేవలకు సంస్థలు భారీగా ఖర్చు చేయడం కొనసాగిస్తున్నాయనే సంకేతం ఇన్వెస్టర్లకు లభించింది.ఏఐ ఆధారిత క్లౌడ్ సేవలకు డిమాండ్ బలంగా ఉందని సూచిస్తూ, ప్రస్తుత త్రైమాసికానికి కూడా కంపెనీ బలమైన వృద్ధిని అంచనా వేసింది. మైక్రోసాఫ్ట్ షేరు విలువ ఒక రోజులో ఈ స్థాయిలో పెరగడం 2008 తర్వాత మళ్లీ ఇప్పుడే తొలిసారని చెబుతున్నారు. గురువారం నాడు మైక్రోసాఫ్ట్ షేర్లు 15 శాతం పెరగ్గా, మెటా షేర్లు దాదాపు 8 శాతం పడిపోయాయి.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.