బుధవారం నాటి ట్రేడింగ్‌లో భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ కొనుగోళ్ల మద్దతుతో పరుగులు పెట్టాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ వంటి కీలక రంగాల షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ లభించడంతో ప్రధాన సూచీలు దాదాపు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. లార్జ్-క్యాప్ షేర్లతో పాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లోనూ సమాంతరంగా కొనుగోళ్లు జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు.

Advertisement

ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 889 పాయింట్లు ఎగబాకి 77,654.60 వద్ద స్థిరపడగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 265 పాయింట్లు లాభపడి 24,250.20 పాయింట్ల గరిష్ట స్థాయి వద్ద ల్యాండ్ అయింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.82 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 1.48 శాతం లాభాలను నమోదు చేయడంతో పెట్టుబడిదారుల ఆసక్తి కేవలం పెద్ద కంపెనీలకే పరిమితం కాకుండా విస్తృత మార్కెట్ అంతటా వ్యాపించిందని స్పష్టమవుతోంది.

Advertisement

ఈ కొనుగోళ్ల జోరులో నిఫ్టీ 50 విభాగంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, హిందుస్థాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్ షేర్లు అగ్రగామిగా నిలిచి మార్కెట్‌ను ముందుకు నడిపాయి. రంగాల వారీగా పరిశీలిస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ సూచీలు అత్యుత్తమ పనితీరు కనబర్చాయి. అయితే ఇతర ప్రధాన రంగాలతో పోలిస్తే నిఫ్టీ రియల్టీ మరియు నిఫ్టీ ఆటో రంగాలు అంతగా రాణించలేక కొంత వెనుకబడ్డాయి.

సాంకేతిక పరంగా చూస్తే.. రాబోయే సెషన్లలో నిఫ్టీకి 24,360 నుండి 24,400 స్థాయిలు కీలకమైన నిరోధక మండలంగా పనిచేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సూచీ గనక ఈ స్థాయిని దాటి నిలదొక్కుకోగలిగితే 24,550, ఆపై 24,700 స్థాయిల వైపు వేగంగా పయనించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ లాభాల స్వీకరణతో మార్కెట్ పడిపోతే.. 100-రోజుల ఈఎమ్‌ఏ కింద ఉన్న 24,130 నుండి 24,100 శ్రేణి నిఫ్టీకి బలమైన మద్దతును అందిస్తుంది.

Advertisement
స్టాక్ మార్కెట్ జోష్.. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా జంప్.. 24,200 దాటిన నిఫ్టీ.. మెరిసిన షేర్లు ఇవే..

మార్కెట్ ఈ స్థాయిలో పుంజుకోవడానికి ప్రధానంగా భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి (IIP) గణాంకాలు అంచనాలను మించి సానుకూలంగా రావడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయాన్నే ఈ సానుకూల వార్తతో ప్రారంభమైన కొనుగోళ్లు రోజంతా నిలకడగా కొనసాగాయి. పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పగటిపూట ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ, ఈ వారం ఓవరాల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం ద్రవ్యోల్బణ ఆందోళనలను గణనీయంగా తగ్గించింది. ఇది దేశీయ ఆర్థిక వృద్ధికి, కంపెనీల వ్యయాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించింది. దీనికి తోడు భారత మార్కెట్ నిర్మాణం బలంగా.. వైవిధ్యభరితంగా ఉండటంతో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులలో (FIIs) నమ్మకం మళ్లీ బలపడుతోంది.

Advertisement

ప్రస్తుతం ఇన్వెస్టర్లందరి చూపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీక్షపై ఉంది. ఫెడ్ తీసుకోబోయే ద్రవ్య విధాన నిర్ణయాలను మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తున్నప్పటికీ.. ఈసారి ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంచనా ఇప్పటికే మార్కెట్లో ప్రతిబింబించినందున, ఫెడ్ నిర్ణయం భారతీయ స్టాక్ మార్కెట్‌పై ప్రత్యేకంగా ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి అనుకూలమైన అంతర్గత ఆర్థిక సంకేతాలు, కంట్రోల్‌లో ఉన్న చమురు ధరలు దేశీయ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.