For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్షీర విప్ల‌వంలో కురియ‌న్ ప్ర‌స్థానం ఇలా...

దేశ శ్వేత విప్ల‌వ పితామ‌హుడు వ‌ర్ఘీస్ కురియ‌న్‌. భార‌త‌దేశం పాల ఉత్ప‌త్తిలో మొద‌టి స్థానంలో ఉండ‌టంలో ప్ర‌ముఖ పాత్ర పోషించాడు. ఆప‌రేష‌న్ ఫ్ల‌డ్ పేరిట ఆయ‌న చేప‌ట్టిన బిలియ‌న్ లీట‌ర్ ఐడియా ప్ర‌పంచంలోనే

|

దేశ శ్వేత విప్ల‌వ పితామ‌హుడు వ‌ర్ఘీస్ కురియ‌న్‌. భార‌త‌దేశం పాల ఉత్ప‌త్తిలో మొద‌టి స్థానంలో ఉండ‌టంలో ప్ర‌ముఖ పాత్ర పోషించాడు. ఆప‌రేష‌న్ ఫ్ల‌డ్ పేరిట ఆయ‌న చేప‌ట్టిన బిలియ‌న్ లీట‌ర్ ఐడియా ప్ర‌పంచంలోనే అతి పెద్ద వ్య‌వ‌సాయాభివృద్ది కార్య‌క్ర‌మంగా నిలిచింది. భౌతిక శాస్త్రం నందు ప‌ట్ట‌భ‌ద్రుడైనా ఉద్యోగాలు చేప‌ట్ట‌క పాల విప్ల‌వం దిశ‌గా ఏది ఆయ‌న్ను ఆక‌ర్షించిందో ఈ కింద తెలుసుకుందాం.

1. కురియ‌న్ ప్ర‌స్థానం

1. కురియ‌న్ ప్ర‌స్థానం

భార‌త‌దేశంలోని గ్రామీణుల జ్ఞానం, వృత్తి నిపుణుల నైపుణ్యాల క‌ల‌యిక వ‌ల్లే ఈ విశ్వంలో భార‌త‌దేశం పేరు చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని న‌మ్మిన వ్య‌క్తి డాక్ట‌ర్ వ‌ర్ఘీస్ కురియ‌న్‌. ఇది దేశంలో స‌హ‌కార ఉద్య‌మాన్ని నిర్మించి, పేద రైతుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చి, భార‌త‌దేశాన్ని పాల ఉత్ప‌త్తిలో స‌మృద్ది క‌లిగిన దేశంగా తీర్చిదిద్దిన కాలిక‌ట్‌కు చెందిన డాక్ట‌ర్ వ‌ర్ఘీస్ అనే ఒక ఇంజినీర్ క‌థ‌.

2. కుటుంబం, జీవితం

2. కుటుంబం, జీవితం

కురియ‌న్ కేర‌ళలోని కాలిక‌ట్‌లో న‌వంబ‌రు 26,1921లో సిరియ‌న్ క్రిస్టియ‌న్ కుటుంబంలో జ‌న్మించారు. ఆయ‌న తండ్రి కొచ్చిన్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో సివిల్ స‌ర్జ‌న్‌గా పనిచేసేవారు. వ‌ర్గీస్ కురియ‌న్ త‌న విద్యాభాస్యాన్ని పెద్ద‌గా త‌ల్లిదండ్రుల వ‌ద్ద గ‌డిపిన ఆన‌వాళ్లు లేవు.

 3. చ‌దువులు

3. చ‌దువులు

ప‌ద్నాలుగేళ్ల వ‌య‌సులో మ‌ద్రాసు ల‌యోలా కాలేజీ నందు డిగ్రీలో చేరారు. 1940లో చిన్న వ‌య‌సులోనే ఫిజిక్స్ ప‌ట్ట‌భ‌ద్రుడ‌య్యాడు. త‌ర్వాత మ‌ద్రాస్ న‌గ‌రం స‌మీపంలో గిండీలోని ఇంజినీరీంగ్ కాలేజీ నుంచి మెకానిక‌ల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. 1946లో చ‌దువులు పూర్త‌యిన త‌ర్వాత జ‌మ్షెడ్ పూర్‌లోని టాటా స్టీల్ టెక్నిక‌ల్ ఇన్‌స్టిట్యూట్ నందు ఉద్యోగంలో చేరి, అందులో ఆస‌క్తి లేక ఉద్యోగాన్నివ‌దిలేశారు. త‌ర్వాత భార‌త ప్ర‌భుత్వ ఉప‌కార వేత‌నంతో అమెరికాలో మెట‌ల‌ర్జీలో మాస్ట‌ర్స్ పూర్తిచేశారు. మిచిగ‌న్ స్టేట్ యూనివ‌ర్సిటీ నుంచి న్యూక్లియ‌ర్ ఫిజిక్స్ మైన‌ర్ స‌బ్జెక్ట్‌గా త‌న పూర్తి విద్యాభాసాన్ని గావించారు.

4. ఉద్యోగంలో ఇలా...

4. ఉద్యోగంలో ఇలా...

అమెరికాలో మెట‌ల‌ర్జీ,ఫిజిక్స్ చ‌ద‌వ‌డానికి మాత్ర‌మే ఆయ‌న‌కు అవకాశం ల‌భించింది. అయితే 1948లో భార‌త‌దేశానికి తిరిగొచ్చిన‌ప్పుడు, ఆయ‌న్ను గుజ‌రాత్‌లోని ఆనంద్ అనే చాలా త‌క్కువ మందికి తెలిసిన గ్రామానికి పంపారు. అక్క‌డ రెండేళ్ల బాండ్‌తో, నెల‌కు 6 వంద‌ల రూపాయ‌ల జీతం మీద ఒక వెన్న‌, జున్ను త‌యారు చేసే ప్ర‌భుత్వ సంస్థ‌లో ప‌నిచేశారు. అక్క‌డ ప‌ని ఎక్కువ‌గా లేక‌పోవ‌డంతో త‌న ఉద్యోగం నుంచి ఎలా వైదొల‌గాలో ఎదురుచూడ‌సాగారు. ప్ర‌తి నెలా కురియ‌న్ అక్క‌డ త‌న‌కు ప‌నిలేద‌ని, అందువ‌ల్ల రాజీనామా చేస్తాన‌ని ప్ర‌భుత్వానికి లేఖ రాసేవాడు. అయితే ప్ర‌భుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు కానీ రాజ‌కీయాలు, దేశ‌భ‌క్తి, వృత్తిప‌ర‌మైన స‌వాళ్ల కార‌ణంగా, కురియ‌న్ అదే ప‌నిలో స‌హ‌కార సంఘాల‌కే న‌మూనాగా నిలిచిన అమూల్‌తో చివ‌రి వ‌ర‌కూ కొన‌సాగాడు.

5. అమూల్ ప్రారంభం ఇలా...

5. అమూల్ ప్రారంభం ఇలా...

కురియ‌న్ ఆనంద్‌కు వ‌చ్చిన స‌మ‌యంలోనే అక్క‌డ స‌న్న‌, చిన్న కారు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త‌మ పాల‌ను స‌మ‌ర్థంగా మార్కెట్‌కు తీసుకుపోవ‌డంలో విఫ‌ల‌మైన వారు- డ‌బ్బు, వ‌న‌రులు, ప్ర‌భుత్వ అధికారుల‌తో సంబంధం ఉన్న పెద్ద డెయిరీల చేతిలో త‌రచుగా దోపిడీకి గుర‌య్యేవార‌ని గ‌మ‌నించారు. అప్ప‌ట్లో గుజ‌రాత్‌లో ఆనంద్‌లో మాత్ర‌మే 1930లో స్థాపించిన 'పోల్స‌స్ డెయిరీ' అనే డెయిరీ ఉండేది. పోల్స‌న్ డెయిరీ స‌మాజంలోని ఉన్న‌త వ‌ర్గాల వారికి ఉన్న‌త శ్రేణి డెయిరీ ఉత్ప‌త్తుల‌ను అందించేది. అయితే స‌రైన ధ‌ర‌లు చెల్లించ‌కుండా, వారు ఇత‌ర ఉత్ప‌త్తిదారుల‌కు అమ్ముకోకుండా అది రైతుల‌ను ఇబ్బంది పెట్టేది. దీనికి ప్ర‌తిఘ‌ట‌న‌గా ఆ ద‌శాబ్ద‌పు ప్రారంభంలో అక్క‌డ రైతులు త్రిభువ‌న్‌దాస్ పాటిల్ ఆధ్వ‌ర్యంలో మొద‌టి స‌హ‌కార సంఘాన్ని ప్రారంభించారు. మొద‌ట్లో అది ఎలాంటి స‌ర‌ఫ‌రా నెట్‌వ‌ర్క్‌, స‌ర‌ఫ‌రా గొలుసు స‌దుపాయాలు లేకుండానే పాల‌ను, డెయిరీ ఉత్ప‌త్తుల‌ను స‌ర‌ఫ‌రా చేసేది. అప్ప‌ట్లో అమూల్ అన్న బ్రాండ్ పేరును అది సంత‌రించుకోలేదు. KDCMPUL(కైరా జిల్లా పాల ఉత్ప‌త్తిదారుల స‌హ‌కార యూనియ‌న్ లిమిటెడ్) అన్న పేరుతో దాన్ని పిలిచేవారు. మొద‌ట అది రోజుకు 247 లీట‌ర్ల పాల‌తో రెండు స‌హ‌కార సంఘాలుగా ప్రారంభమై అమూల్ అనే స‌హ‌కార సంఘం ఏర్ప‌డ‌టానికి దారితీసింది.

 6. సంఘం పుంజుకుందిలా...

6. సంఘం పుంజుకుందిలా...

అమూల్ పేరిట పాల స‌హ‌కార సంఘ విప్ల‌వాన్ని ముందుకు తీసుకెళ్లిన వాడు కురియ‌నే. త‌న ఉద్యోగం ప‌ట్ల అసంతృప్తీ, ఒంట‌రిత‌నం-ఆయ‌న స్థానిక రైతుల‌కు, త్రిభువ‌న్‌దాస్‌కు చేరువ కావ‌డానికీ దారి తీశాయి. ఆ స‌హ‌కార సంఘం చేస్తున్న కృషి, దిక్కుతోచ‌ని రైతుల స్థితి కురియ‌న్‌లో ప‌ట్టుద‌ల రేకెత్తించాయి. అందువ‌ల్ల ఆ స‌హ‌కార సంఘాన్ని విస్తృతం చేయాల‌ని కోరిన స‌మ‌యంలో కురియ‌న్ వెంట‌నే అందుకు అంగీక‌రించాడు. ముందుగా రూ.60 వేల‌తో ఒక పాశ్చ‌రైజేష‌న్ యంత్రాన్ని కొనాల‌ని ఆయ‌న ప్ర‌తిపాదించాడు. అది చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌దైన‌ప్ప‌టికీ, దాని వ‌ల్ల వారికి చాలా మేలు జ‌రిగింది. దీని వ‌ల్ల పాలు పాడ‌వ‌కుండా ముంబైకు ర‌వాణా చేయ‌డం వీలైంది. దీంతో వారి స‌హ‌కార సంఘం క్ర‌మంగా పుంజుకోవ‌డం ప్రారంభ‌మైంది.

7. భూమి లేని కూలీల‌కు అద‌రువు

7. భూమి లేని కూలీల‌కు అద‌రువు

స‌హ‌కార సంఘం నెమ్మ‌దిగా విజ‌య‌వంత‌మైన వార్త అంద‌రికీ తెలిసింది. ఈ విష‌యం ఆ ప్రాంత‌మంత‌టా పాక‌డంతో ఇత‌ర జిల్లాల రైత‌న్న‌లు అక్క‌డికి రావ‌డం, వారి విజ‌యాన్ని ప‌రిశీలించ‌డం, కురియ‌న్‌తో మాట్లాడ‌టం ప్రారంభ‌మైంది. ఇలా వ‌చ్చేవారిలో ఎక్కువ మంది భూమి లేని కూలీలు ఉండేవారు. వారి ఆస్తి మొత్తం ఒక ఆవు, గేదె అయి ఉండేది. గేదె పాల‌ను స్కిమ్ పౌడ‌ర్ లేదా ఘ‌న‌రూపంలోని పాల‌గా మార్చే యంత్రాన్ని క‌నిపెట్టిన హెచ్‌.ఎమ్.ద‌ల‌యా వారి ఉద్య‌మానికి మ‌రింత ప్రాచుర్యం క‌ల్పించారు. ఈ సంచ‌ల‌న ఆవిష్క‌ర‌ణ‌తో దేశంలో ల‌భించే బ‌ర్రె పాల‌నన్నింటినీ స‌హ‌కార సంఘాలు స‌మ‌ర్థంగా వినియోగించుకోవ‌డానికి అవ‌కాశం ల‌భించి, అవి కేవ‌లం ఆవు పాల‌మీద ఆధార‌ప‌డి న‌డిచే బ‌హుళ‌జాతి కంపెనీల‌తో పోటీ ప‌డ‌టానికి వీలైంది.

8. 1946 నుంచి 1960

8. 1946 నుంచి 1960

వ‌ర్గీస్ కురియ‌న్ అమూల్ ప్రారంభం నుంచి దేశ‌వ్యాప్తంగా విస్త‌రించే వ‌ర‌కూ ఎక్క‌డా విశ్ర‌మించ‌లేదు. కురియ‌న్ త్రిభువ‌ద‌న్ దాస్ అనే వ్య‌క్తితో క‌లిసి ఖేడా జిల్లాల స‌హ‌కార సంఘాల‌ను నెల‌కొల్పారు. ఈ స‌హ‌కార సంఘాలు గ్రామాల్లోని రైతుల నుంచి రోజుకు రెండు సార్లు పాల‌ను సేక‌రించేవి. ఆ పాల‌లోని కొవ్వు శాతానికి అనుగుణంగా వారికి చెల్లింపులు జ‌రిగేవి. కొవ్వును కొలిచే యంత్రాలు, హ‌ఠాత్తుగా నిర్వ‌హించే చెకింగ్, పాల సేక‌ర‌ణపై రైతుల‌కు అవ‌గాహ‌న పెంచ‌డం త‌దిత‌ర కార్య‌క్ర‌మాల ద్వారా అక్ర‌మాలు అరిక‌ట్ట‌డానికి, మొత్తం కార్య‌క‌లాపాల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి ప్ర‌య‌త్నాలు చేసేవారు. ఇలా సేక‌రించిన పాల‌ను అదే రోజు ద‌గ్గ‌ర్లోని పాల శీత‌లీక‌ర‌ణ కేంద్రానికి స‌ర‌ఫ‌రా చేసేవారు. అక్క‌డ కొన్ని గంట‌ల పాటు నిల్వ చేసిన అనంత‌రం, దానిని పాశ్చ‌రైజేష‌న్ కొర‌కు, ఆ త‌ర్వాత చివ‌ర‌గా శీత‌లీక‌ర‌ణ మ‌రియు ప్యాకేజింగ్ యూనిట్‌కు త‌ర‌లించేవారు. ఆ త‌ర్వాత

ఆ పాలు హోల్‌సేల్ డిస్ట్రిబ్యూట‌ర్‌కు, రెండంచెల మార్కెటింగ్ ప‌ద్ద‌తుల ద్వారా అక్క‌డి నుంచి చిల్ల‌ర వ‌ర్త‌కుల‌కు, చివ‌ర‌గా వినియోగ‌దారుల చెంత‌కు చేరేవి. ఈ పై స్థాయి స‌ర‌ఫ‌రా గొలుసును మొత్తం కురియ‌న్, త్రిభువ‌న్ దాస్‌లే రూపొందించారు. దీని వ‌ల్ల ఆ స‌హ‌కార వ్య‌వ‌స్థ రోజురోజుకీ మెరుగవ‌డం ప్రారంభ‌మై, చివ‌రికి 1960లో అమూల్ గుజ‌రాత్‌లో విజ‌యానికి ప‌ర్యాయ‌ప‌దంగా మారింది.

 9. అమూల్ అనే పేరిలా

9. అమూల్ అనే పేరిలా

KDCMPU- కైరా మిల్క్ యూనిట్ పేరు కాస్త క‌ష్టంగా ఉండేది. అది సుల‌భంగా ఉండేలా, అంద‌రి నోళ్ల‌లో నానేలా ఒక ప్ర‌త్యేక‌మైన పేరును ఇవ్వాల‌ని కురియ‌న్ నిర్ణ‌యించారు. ఒక మంచి పేరు సూచించ‌మ‌ని ఉద్యోగులు, రైతుల‌ను కోర‌డం జ‌రిగింది. ఒక క్వాలిటీ కంట్రోల్ సూప‌ర్‌వైజ‌ర్ అమూల్య అన్న పేరును సూచించారు. సంస్కృత ప‌ద‌మైన అమూల్య అంటే వెల క‌ట్ట‌లేనిది, అంటే సాటిరానిది. ఆ త‌ర్వాత యూనియ‌న్ పేరు కూడా వ‌చ్చేలా ఆ పేరును అమూల్గా మార్చేశారు. అలా నేటి బ్రాండ్ నేమ్‌- AMUL- ఆనంద్ మిల్క్ యూనియ‌న్ లిమిటెడ్ వాడుక‌లోకి వ‌చ్చింది.

10. క్షీర విప్ల‌వం

10. క్షీర విప్ల‌వం

క్షీరం అంటే పాలు. ఈ క్షీర విప్ల‌వ కార్య‌క్ర‌మం భార‌త‌దేశం ఎదుర్కొంటున్న పాల కొర‌త‌ను తీర్చి ప్ర‌పంచంలో పాలను అత్య‌ధికంగా ఉత్ప‌త్తి చేస్తున్న దేశాల‌లో ఒక‌టిగా నిలిపి, 1998లోనే పాల ఉత్ప‌త్తిలో మ‌నం అమెరికాను దాటిపోయేలా చేసింది. 2010-11లో మొత్తం ప్ర‌పంచంలోని పాల ఉత్ప‌త్తిలో మ‌న దేశం వాటా 17 శాతం. అంటే 3 ద‌శాబ్దాల‌లో వ్య‌క్తిగ‌త త‌ల‌స‌రి వినియోగం రెండు రెట్ల‌యింది. ఈ కాలంలో పాడిప‌రిశ్ర‌మ భార‌త‌దేశ‌పు అతిపెద్ద స్వ‌యం స‌మృద్ది క‌లిగిన ప‌రిశ్ర‌మ‌గా రూపుదిద్దుకుంది. ఈ త‌ర్వాత కురియ‌న్ అతిపెద్ద శ‌క్తిమంత‌మైన నూనె స‌ర‌ఫ‌రా లాబీని ఎదిరించి, మ‌న దేశం వంట‌నూనెల ఉత్ప‌త్తిలో కూడా స్వ‌యం స‌మృద్ది సాధించేలా చేశారు.

 11. అమూల్‌తో పాటు ఆయ‌న ఆధ్వ‌ర్యంలోని సంస్థ‌లు

11. అమూల్‌తో పాటు ఆయ‌న ఆధ్వ‌ర్యంలోని సంస్థ‌లు

జాలరుల స‌హ‌కార సంఘాలు, ప‌శుపోష‌క స‌హ‌కార సంఘాలు, క‌ల‌పేత‌ర అట‌వీ ఉత్ప‌త్తుల స‌హ‌కార సంఘాలు, రైతు స‌హ‌కార సంఘాలు, పొదుపు, రుణ స‌హ‌కార సంఘాలు, వ్య‌వ‌సాయ యూనియ‌న్లు, స్వ‌యం స‌హాయ‌క బృందాలు, స‌మాఖ్య‌లు మొద‌లైన దాదాపు 30 సంస్థ‌ల‌ను కురియ‌న్ స్థాపించ‌డం జ‌రిగింది.

12.ఆయా సంస్థ‌ల స‌క్సెస్ ఫార్ములా

12.ఆయా సంస్థ‌ల స‌క్సెస్ ఫార్ములా

కురియ‌న్ దాదాపు 60 ఏళ్ల పాటు పేద ప్ర‌జ‌ల సంస్థ‌ల‌ను నిర్మిస్తూ, వాటిని బలోపేతం చేస్తూ జీవించారు. ఒక అద్భుత‌మైన సామాజిక పారిశ్రామిక వేత్త అయిన కురియ‌న్, అమూల్ పేరిట చిన్న‌, స‌న్న‌కారు పాడి రైతుల ప‌రిశ్ర‌మ‌ను అభివృద్ది చేశారు. ఇది దేశంలోనే పేరెన్నిక‌గ‌న్న ప్ర‌జా పారిశ్రామిక న‌మూనాగా పేరు పొందింది. ఆయ‌న ఇదే న‌మూనాను కూగాయ‌లు, నూనె గింజల ఉత్ప‌త్తిలో కూడా అనుస‌రించారు. స‌హ‌కార సంస్థ‌లు మూడు ప‌నులు చేయాల‌ని ఆయ‌న బ‌లంగా న‌మ్మారు.

1. ఉత్ప‌త్తి విలువ గొలుసులో ద‌ళారుల‌ను నిర్మూలించ‌డం

2. సేక‌ర‌ణ‌, శుద్ది చేయ‌డం, మార్కెటింగ్‌ల్లో స‌భ్యుల ప్ర‌మేయం ఉండేలా చూడ‌టం

3. స‌హ‌కార సంఘం కార్య‌కలాపాల్లో వృత్తి నైపుణ్య‌త‌ను పెంపొందించ‌డం

 13. రాజ‌కీయాల‌కు దూరంగా

13. రాజ‌కీయాల‌కు దూరంగా

అమూల్ సాధించిన విజ‌యంతో ఆ ప్రాంతం, కురియ‌న్ ప్ర‌భుత్వం దృష్టిలో ప‌డ్డారు. క్ర‌మంగా ఆ సంస్థ దేశంలోనే భారీ ఆహారోత్ప‌త్తుల బ్రాండ్‌గా రూపుదిద్దుకున్నా కురియ‌న్ ఆనంద్‌లోనే ఉండిపోయారు. 1964లో నాటి ప్ర‌ధాన మంత్రి లాలా్ బ‌హుదూర్ శాస్త్రిని ఆనంద్‌లోని కొత్త ప‌శుదాణా ప్లాంట్‌ను ప్రారంభించడానికి ఆహ్వానించారు. దాన్ని ప్రారంభించాక ఆయ‌న అదే రోజు తిరిగి వెళ్లాల్సి ఉండింది. కానీ ఆయ‌న అక్క‌డే కొంత సేపు ఉండి, ఆ స‌హ‌కార ఉద్య‌మ విజ‌యాల‌ను ప‌రిశీలించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ ప్రాంతంలోని దాదాపు అన్ని స‌హ‌కార సంస్థ‌ల‌నూ కురియ‌న్తో పాటు క‌లిసి పరిశీలించిన శాస్త్రి, అమూల్ రైతుల నుంచి పాల‌ను సేక‌రిస్తున్న విధానం, అదే స‌మ‌యంలో దాని వ‌ల్ల వారి ఆర్థిక ప‌రిస్థితుల్లో వ‌చ్చిన మార్పుల ప‌ట్లా సంతృప్తి చెందారు. ఆ త‌ర్వాత ఢిల్లీకి వెళ్లి, అమూల్ త‌ర‌హాలోనే స‌హ‌కార ఉద్య‌మాన్ని దేశ‌వ్యాప్తంగా విస్త‌రించాల‌ని కురియ‌న్‌కు విజ్ఞప్తి చేశారు. వీరిద్ద‌రి కృషి వ‌ల్ల 1965లో జాతీయ పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ది బోర్డు(ఎన్‌డీడీబీ) ఏర్పాటైంది. ఎన్‌డీడీబీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన కురియ‌న్, అమూల్ న‌మూనాను దేశ‌వ్యాప్తంగా విస్త‌రించే బృహ‌త్కార్యాన్ని భుజానికెత్తుకున్నారు. అదే స‌మ‌యంలో దేశంలో పాల ఉత్ప‌త్తి కంటే డిమాండ్ పెర‌గ‌డం ప్రారంభ‌మైంది. ఎన్‌డీడీబీ, భార‌త ప్ర‌భుత్వం క‌లిసి అప్పుడే త‌గిన చ‌ర్య‌లు తీసుకోన‌ట్లైతే మ‌న దేశం కూడా పొరుగు దేశం శ్రీలంక మాదిరిగా పాల‌ను అత్య‌ధికంగా దిగుమ‌తి చేసుకునే దేశాల్లో ఒక‌టిగా మారి ఉండేది.

అమూల్ బ్రాండ్ విస్త‌ర‌ణ ఇలా...

అమూల్ బ్రాండ్ విస్త‌ర‌ణ ఇలా...

అమూల్ బ్రాండ్ 50 దేశాల‌కు పైగా విస్త‌రించింది.

మ‌న దేశంలో దాదాపు 7200 ఎక్స్‌క్లూజివ్ పార్ల‌ర్ల‌ను క‌లిగి ఉంది.

అమూల్ ప్ర‌తి అడుగు, విస్త‌ర‌ణ‌లోనూ కురియ‌న్ ఆలోచ‌న‌లు, సూచ‌న‌లు ఉంటాయి.

ఎన్నో కోట్ల మంది రైతులు అమూల్ ద్వారా త‌మ పాల‌ను వ్య‌వ‌స్థీకృతంగా అమ్మ‌కుంటారు, స‌మ‌యానికి త‌మ బిల్లుల‌ను అందుకుంటున్నారు.

ఎన్నో కోట్ల మంది వినియోగ‌దారులు నాణ్య‌మైన పాల‌ను తాగ‌గ‌లుగుతున్నారు.

Read more about: amul milk business
English summary

క్షీర విప్ల‌వంలో కురియ‌న్ ప్ర‌స్థానం ఇలా... | amazing story of amul India Brand built by verghese kurien

verghese kurien helped establish the Amul cooperative, today India's largest food brand, where three-fourths of the price paid by the consumer goes to the producing dairy farmer, who is the cooperative's owner. A key invention at Amul, the production of milk powder from the abundant buffalo-milk, instead of from cow-milk, short in supply in India, enabled it to compete in the market with success. He found the National Dairy Development Board (NDDB) in 1965, to replicate Amul's "Anand pattern" nationwide.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X