English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

త‌క్కువ పెట్టుబ‌డితో 10 సొంత వ్యాపారాలు

Posted by: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

వ్యాపారం ప్రారంభించాలంటే ఇంత‌కుముందు లాగా మొట్ట‌మొద‌టి కార‌కం డ‌బ్బు అనే రోజులు పోయాయి. ఐడియా(ఆలోచ‌న‌) ముఖ్యం. కొన్ని వ్యాపారాల‌కు అస‌లు పెట్టుబ‌డే అవ‌స‌రం లేకుండా లేదా చాలా త‌క్కువ సొమ్ముతో నెట్టుకురావ‌చ్చ‌ని తెలిస్తే మీరు ఆశ్చర్య‌పోతారు. కింద తెలిపిన కొన్ని ర‌కాల ఆలోచ‌న‌ల‌తో మీరు త్వ‌ర‌గా ధ‌న‌వంతులైతే కాలేరు కానీ మీకంటూ సొంత గుర్తింపు ల‌భిస్తుంది. సాంకేతిక‌త‌పై కొద్దిపాటి అవ‌గాహ‌న ఉంటే సొంతంగా డ‌బ్బు సంపాదించుకోవ‌డం ఎలాగో ఈ కింద చూడండి.

1. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేష‌న్‌(ఎస్ఈవో) క‌న్స‌ల్టెన్సీ

ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో బాగా ప‌ట్టున్న వారికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేష‌న్ క‌న్స‌ల్టెన్సీ పెట్టుకోవ‌డం ఒక మంచి వ్యాపార మార్గం. దీనికి పెద్ద‌గా ఆఫీస్ సెట‌ప్ అవ‌స‌రం లేదు. వెబ్‌సైట్ల‌కు ప్ర‌మోష‌న్ కోసం పెద్ద పెద్ద సంస్థ‌లు ఎస్ఈవో నిపుణుల‌ను సంప్ర‌దిస్తాయి. ఎస్ఈవో నిపుణులు త‌మ ప్ర‌తిభ‌తో ఇంట‌ర్నెట్ మార్కెటింగ్‌ను తీర్చిదిద్దుతారు. చైనా త‌ర్వాత అతి ఎక్కువ ఇంట‌ర్నెట్ వాడ‌కందార్లు క‌లిగిన దేశం మ‌న‌దే కాబ‌ట్టి దీనికి రానురాను వ్యాపార అవ‌కాశాలు పెరుగుతూనే ఉంటాయి.
ప్ర‌తి రోజు కొన్ని వేల వెబ్‌సైట్లు, బ్లాగులు మొద‌ల‌వుతూ ఉంటాయి. అందులో కొన్ని మాత్ర‌మే మార్కెట్‌లో నిల‌దొక్కుకుంటాయి. మిగిలిన‌వి ఎందుకు విఫ‌ల‌మ‌వుతున్నాయంటే వాటికి స‌రైన మార్కెటింగ్ లేక‌పోవ‌డ‌మే. ఎస్ఈవో క‌న్స‌ల్టెన్సీ పెట్టేందుకు పెద్ద‌గా పెట్టుబ‌డేమీ అవ‌స‌రం లేదు. ఎస్ఈవో కన్స‌ల్టెంట్ ఎలా పనిచేస్తాడో మొద‌ట మీకు తెలియ‌క‌పోతే దానికి సంబంధించిన 3 నెల‌ల కోర్సుల‌ను చేయ‌వ‌చ్చు. త‌ర్వాత మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించ‌వ‌చ్చు.

2. బ్లాగింగ్‌

మీకు రాయ‌డంలో చేయితిరిగే ప్రావీణ్యం ఉంటే బ్లాగింగ్ మ‌రో మంచి వ్యాప‌కం, వ్యాపార మార్గం. ఎటువంటి ఖర్చు లేకుండా బ్లాగింగ్‌ను ప్రారంభించ‌వ‌చ్చు. బ్లాగింగ్ ద్వారా ఎక్కువ డ‌బ్బు సంపాదించాలంటే ఎంతో అంకిత భావం, శ్ర‌మ‌, ఓపిక‌, వేచి చూసే ధోర‌ణి, నిల‌క‌డ వంటివి ఉండాలి. బ్లాగింగ్‌ను ఎప్పుడూ మీరు ఏదైతే రంగంలో మంచి అవ‌గాహ‌న క‌లిగి ఉన్నారో దానితో మొద‌లెట్టాలి. అది వంట‌, ఆర్థిక విష‌యాలు, డిజిట‌ల్ టెక్నాల‌జీ, ప‌ర్స‌నాలిటీ డెవ‌ల‌ప్‌మెంట్‌, కెరీర్ కౌన్సిలింగ్ వంటివి ఏదైనా కావ‌చ్చు. మీరు నెట్‌లో సెర్చ్ చేస్తే మీకు సంబంధించిన రంగానికి చెందిన ఎన్నో వెబ్‌సైట్లు మీకు తార‌స‌ప‌డతాయి. అయిన‌ప్ప‌టికీ కొత్త‌వారికి అవ‌కాశం ఉంటుంద‌నే అంశాన్ని మీరు గుర్తించాలి. కావ‌ల్సింద‌ల్లా ఆ రంగంపై ప‌ట్టు, కాస్త వైవిధ్య‌త‌. సీఎమ్ఎస్‌, డొమైన్‌, ఎస్ఈవో వంటి విష‌యాల‌ను మీరు నెమ్మ‌దిగా నేర్చుకుంటారు.

3. ఈబే ట్రేడింగ్‌

ఈబే గురించి విన్నారా? ఆన్‌లైన్లో వ‌స్తువుల‌ను కొనేందుకు ఉప‌యోగ‌ప‌డే ఒక ట్రేడింగ్ సైట్. ఏదైనా వ‌స్తువును మొద‌ట ముందు త‌క్కువ‌కు కొని ఆన్‌లైన్‌లో ఎక్కువ ధ‌ర‌కు అమ్మ‌గ‌ల‌రు అనుకుంటే ఇక్క‌డ మీరు విజ‌య‌వంత‌మైన‌ట్లే. ఇందుకోసం మీరు ముందుగా ట్రేడ‌ర్‌గా న‌మోద‌వ్వాలి. మీ వ‌స్తువును ఆన్‌లైన్‌లో వేలానికి పెట్ట‌డం ద్వారా కొనుగోలుదారుల‌ను బిడ్ల‌కు ఆహ్వానించ‌వ‌చ్చు.దీని ద్వారా మీ ఉత్ప‌త్తుల‌కు మంచి ధ‌ర‌ను పొంద‌వ‌చ్చు. ఇందులో డ‌బ్బు కంటే స‌మ‌యం ప్ర‌ధానం. తాజా బిడ్ల గురించి తెలుసుకునేందుకు మీరు స‌మయాన్ని వెచ్చించాలి.

4. ఆభ‌ర‌ణాల త‌యారీ

భార‌తీయుల‌కు బంగారం అంటే ఎంతో ప్రీతి. మీకు కూడా ప‌సిడి అంటే ఇష్టం ఉంటే దాన్ని వృత్తిగా మార్చుకోవ‌చ్చు. బంగారం ఆభ‌ర‌ణాల త‌యారీ కోర్సులో చేరి దాన్ని నేర్చుకోవ‌చ్చు. దాని త‌ర్వాత సొంత వ్యాపారాన్ని ప్రారంభించి వెరైటీ ఆభ‌ర‌ణాల‌ను త‌యారుచేసి అమ్మ‌వ‌చ్చు.
ఇక్క‌డ మీరు కృత్రిమ ఆభ‌ర‌ణాల త‌యారీకి డిజైన‌ర్‌గా మారొచ్చు లేదంటే బంగారం, డైమండ్‌, ప్లాటిన‌మ్ వంటి వాటికి మంచి డిజైన్ల‌ను త‌యారీ చేసే నిపుణుడిగా మార‌వ‌చ్చు. మీరు డీల‌ర్ల అవ‌స‌రాల‌ను బ‌ట్టి డిజైన్ల‌ను చేయాల్సి ఉంటుంది. మెటీరియ‌ల్‌ను తీసుకుని అవ‌స‌రాల‌కు త‌గ్గ డిజైన్ల‌ను ఇవ్వ‌డ‌మే మీ ప‌ని.

5. వెడ్డింగ్ ప్లానింగ్‌

మ‌న‌దేశంలో పెళ్లి వేడుక‌లు చాలా గ్రాండ్‌గా చేసుకోవాల‌ని చాలా మంది కోరుకుంటారు. ఇది జీవితాంతం గుర్తుండి పోయే విష‌యం కాబ‌ట్టి దానికి అంత ప్రాముఖ్య‌తనిస్తారు. మ‌ల్టీ టాస్కింగ్‌పై మీకు చెప్పుకోద‌గ్గ సామ‌ర్థ్యం ఉండి కొంచెం సృజ‌నాత్మ‌క‌త జోడించ‌గ‌లిగితే వెడ్డింగ్ ప్లానింగ్ ఒక మంచి ఆలోచ‌న‌. ఒక కార్యాల‌యాన్ని అద్దెకు తీసుకోవాలి. క్ల‌యింట్ నెట్‌వ‌ర్క్‌ను ఏర్ప‌రుచుకోవ‌డం ఇక్క‌డ ప్ర‌ధానం. ఇందుకోసం మొద‌ట్లో బాగా శ్ర‌మించాలి. ఇది నేర్పుగా చేసుకోగ‌లిగితే ఒక‌సారి పెట్టే పెట్టుబ‌డితే బంగారు భ‌విష్య‌త్తుకు బాట‌లు వేసుకోవ‌చ్చు.

6. ఆహార శాల‌(ఫుడ్ రెస్టారెంట్‌)

ఫుడ్ రెస్టారెంట్ ఎప్ప‌టికీ డిమాండ్ త‌గ్గ‌ని వ్యాపారం. కాస్త పేరు తెచ్చుకుంటే చాలు క‌స్ట‌మ‌ర్లు క్ర‌మంగా అదే రెస్టారెంట్ వ‌స్తూంటారు. మీరు చేయాల్సింద‌ల్లా అదే నాణ్య‌త‌ను కొన‌సాగించ‌డం. నోరూరించే వంట‌కాల‌తో ఆహార‌ప్రియుల‌ను నిత్యం ఆక‌ట్టుకునేలా మీరు వంట‌లు చేయ‌గ‌ల‌గాలి. స‌క్ర‌మంగా, కొంచెం తెలివితే చేసుకోగ‌లిగితే ఈ వ్యాపారంలో క‌నీస లాభాల‌తో ప్రారంభించి ఎంతో ఎత్తుకు ఎద‌గ‌డానికి అవ‌కాశం ఉంటుంది. మీకంటూ ఒక ప్ర‌త్యేక‌త‌ను ఏర్ప‌రుచుకోవ‌డం మొద‌ట ముఖ్యమైన విష‌యం. త‌ర్వాత ఎప్ప‌టిక‌ప్పుడు రెస్టారెంట్‌కు వ‌చ్చేవారికి బోర్ కొట్ట‌కుండా స‌రికొత్త వంట‌కాల‌ను ప్ర‌య‌త్నిస్తూ ఆక‌ట్టుకునేందుకు కృషి చేయాలి.

7. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌

దేశంలో క్ర‌మంగా విస్త‌రిస్తున్న వ్యాపార ధోర‌ణుల్లో ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఒక‌టి. కార్పొరేట్ ఈవెంట్స్‌, అవార్డు ప్ర‌జెంటేష‌న్లు, కుటుంబ పార్టీలు వంటివి నిత్యం పెరుగుతూ ఉన్నాయి. ఇవ‌న్నీ ఏ మాత్రం గాబ‌రా లేకుండా నిర్వ‌హించ‌డానికి కంపెనీలు మంచి ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ‌ల కోసం వెతుకుతాయి. మీరు ఈ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోగ‌ల‌గాలి. ఇందుకోసం వ్యాపార నెట్‌వ‌ర్క్ ఉండి స‌మ‌యానికి అన్ని ప‌నులు జ‌రిగేలా చూసే నైపుణ్యం ఉండాలి. ఈ వ్యాపారానికి మొద‌ట్లో కొంచెం పెట్టుబ‌డి కావాలి. దాన్ని ఎలాగోలా స‌మ‌కూర్చుకోగ‌లిగితే త‌ర్వాత రాబ‌డి బాగానే ఉంటుంది.

8. రిక్రూట్‌మెంట్ క‌న్స‌ల్టెన్సీ

విజ‌య‌వంత‌మైన వ్యాపారాల్లో మ‌రోటి రిక్రూట్‌మెంట్ సంస్థ‌ను ఏర్పాటు చేయ‌డం. నిరుద్యోగం పెరుగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఈ ర‌క‌మైన సంస్థ‌ల‌కు డిమాండ్ ఏర్ప‌డుతోంది. దీనికి పెద్ద‌గా పెట్టుబ‌డి అక్క‌ర్లేదు. ఒక చిన్న కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకుని కొన్ని చిన్న‌, మ‌రి కొన్ని పెద్ద కంపెనీల‌తో మాన‌వ వ‌న‌రుల(హెచ్ఆర్‌)తో క్ర‌మంగా సంప్ర‌దింపులు చేస్తూ ఉండాలి. వారికి అవ‌స‌ర‌మైన రిసోర్స్‌ను అందించేందుకు ప్ర‌య‌త్నిస్తూ మీ ద‌గ్గ‌రికి వ‌చ్చే ఉద్యోగార్థుల‌కు ఆ నైపుణ్యాల‌ను పెంపొదించేలా చూసుకోవాలి. 2008 ఆర్థిక మంద‌గ‌మ‌నం త‌ర్వాత కంపెనీలు ఎక్కువ‌గా ఉద్యోగాల‌ను కాంట్రాక్టు ప‌ద్ద‌తిలో నియ‌మించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. దీంతో కంపెనీలకు రిక్రూట్‌మెంట్ సంస్థ‌లు ఉద్యోగార్థుల‌ను పంపించి, వారు నియ‌మితులైన త‌ర్వాత ఒక్కో అభ్య‌ర్థికి కొంచెం ద‌బ్బును చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇక్క‌డ విజ‌య‌వంతం అవ్వాలంటే అస‌లు కంపెనీల‌కు ఏమి కావాలో స‌రిగా మీరు గుర్తించ‌గ‌ల‌గాలి.

9. రియ‌ల్ ఎస్టేట్ లేదా ప్రాప‌ర్టీ క‌న్స‌ల్టెంట్‌

రోజురోజుకీ స్థలాలు, ఇళ్ల‌కు గిరాకీ పెరుగుతున్న క్ర‌మంలో రియ‌ల్ ఎస్టేట్ క‌న్స‌ల్టెంట్‌గా మారి డ‌బ్బు సంపాదించుకోవ‌డానికి ఆస్కారం ఉంది. రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డుల ద్వారా చాలా మంది మంచిగానే డ‌బ్బు ఆర్జిస్తారు. ఈ విధంగా కన్స‌ల్టెంట్‌గా ఉండ‌టం ద్వారా త‌క్కువ పెట్టుబ‌డితో మీరు సొంత వ్యాపారాన్ని ప్రారంభించిన‌ట్ల‌వుతుంది. మీరు ఏ ప్రాంతంలో అయితే వ్యాపారాన్ని ప్రారంభించాలో దానిపై స‌మ‌గ్ర అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి. ఈ రంగంలో ఉన్న ఎక్కువ మందితో ప‌రిచ‌యాలు ఉండ‌టం అద‌న‌పు సానుకూల‌త‌. మంచి స్థలాన్ని కొనుగోలుదార్ల‌కు చూపిన‌ట్ల‌యితే మీరు క్ర‌మ‌క్ర‌మంగా పేరు సంపాదిస్తారు. క‌న్స‌ల్టెంట్ చార్జీల రూపంలో క‌మీష‌న్ అందుతుంది.

10. ఆఫీసు మెటిరీయ‌ల్ స‌ప్లై

ఆఫీసులు, పాఠ‌శాల‌ల‌కు అప్పుడప్పుడు మెటిరీయ‌ల్ అవ‌స‌రం అవుతుండ‌టం మ‌నం చూస్తుంటాం. ఒక ర‌క‌మైన ఆఫీసులు నిత్యం డ‌బ్బు, స‌మ‌యం వెచ్చించి కొత్త మెటిరీయ‌ల్ కోసం ప్ర‌యాస పడుతుంటాయి. ఇక్క‌డ మీరు అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోగ‌ల‌గాలి. ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు పొంది కార్యాల‌యాన్ని ప్రారంభించాలి. మొద‌ట ప్ర‌భుత్వ ఆర్డ‌ర్ల‌ను తెచ్చుకోగ‌లిగితే క్ర‌మంగా బిజినెస్ నిల‌దొక్కుకోగ‌లుగుతారు. కార్యాల‌యాల‌ను నిత్యం సంప్ర‌దిస్తూ ఆర్డ‌ర్ల‌ను తెచ్చుకుంటూం ఉండాలి. అవ‌స‌ర‌మయ్యే ఫ‌ర్నిచ‌ర్‌, స్టేష‌న‌రీ వంటి వాటిన స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు అందించేందుకు ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఎదుటివారిని క‌న్విన్స్ చేసే నేర్పును అల‌వ‌ర్చుకోవాల్సి ఉంటుంది.

Story first published: Saturday, August 20, 2016, 10:45 [IST]
English summary

10 business ideas with great ideas with low budget

Do you still believe in notion that you need huge money to start a new business? You will be surprised to know that there are several businesses that need very little or no money at all and still you can make it a profitable venture if managed properly.Below listed are few business ideas that can be started. Today there are several dynamic individuals who aspire to start their own business but hold back thinking about money.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC